కరోనా వైరస్ గాలి ద్వారా వ్యాప్తి చెందుతుందని ఇప్పటికే పలువురు నిపుణులు, సంస్థలు చెప్పిన విషయం విదితమే. అయితే కరోనా వైరస్ గాలిలో ఎంత దూరం వరకు ప్రయాణిస్తుందనే విషయంపై అమెరికాకు చెందిన సీడీసీ తాజాగా స్పష్టతను ఇచ్చింది. కరోనా సోకిన వ్యక్తి నుంచి వైరస్ సుమారుగా 3 నుంచి 6 అడుగుల దూరం వరకు వ్యాప్తి చెందుతుందని తెలిపింది.
కరోనా వైరస్ ఉన్న వ్యక్తి దగ్గినప్పుడు, శ్వాసించినప్పుడు లేదా తుమ్మినప్పుడు పెద్ద బిందువులు వెంటనే కింద పడిపోతాయి. కానీ చిన్న బిందువులు 3 నుంచి 6 అడుగుల దూరం వరకు ప్రయాణిస్తాయి. అలాగే అవి గాలిలో ఎక్కువ సేపు యాక్టివ్‌గా ఉంటాయి. ఇక గాలి, వెలుతురు సరిగ్గా లేని ప్రాంతాల్లో కరోనా వ్యక్తులు ఉంటే వారి నుంచి విడుదలయ్యే వైరస్ కణాలు ఎక్కువ సేపు ఉంటాయి. అలాగే అవి అలాంటి ప్రాంతాల్లో ఎక్కువ దూరం వెళ్తాయి.
ఇక కరోనా సోకిన వ్యక్తి వెళ్లిన మార్గంలో ఇతరులు కూడా వెళ్తే అలాంటి వారికి కూడా కరోనా సోకేందుకు అవకాశం ఉంటుందని సీడీసీ తెలిపింది. అందువల్ల ప్రతి ఒక్కరూ మాస్కులను ధరించాలని, భౌతిక దూరం పాటించాలని, శానిటైజర్లు లేదా హ్యాండ్ వాష్‌లు, సబ్బులను ఉపయోగించాలని సూచించింది.