Ram Charan : మెగా ఫ్యామిలీ హీరోలు తమ సినిమాలతోనే కాదు సేవా కార్యక్రమాలతోను అందరి మనసులు కొల్లగొడుతుంటారు. చిరంజీవి ఎన్నో సేవా కార్యక్రమాలతో అశేష ప్రేక్షకాదరణ పొందగా, ఆయన తనయుడు రామ్ చరణ్ కూడా తండ్రి బాటలో పయనిస్తున్నాడు. మెగా పవర్ స్టార్ గా మారిన చెర్రీ.. ఇటీవల ట్రిపుల్ ఆర్ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయ్యాడు. అల్లూరి సీతారామరాజుగా అలరించిన రామ్ చరణ్ విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. పాన్ ఇండియా స్టార్ గా ఎదిగిన రామ్ చరణ్ తాజాగా తన మంచి మనసు చాటుకున్నాడు. క్యాన్సర్ తో పోరాడుతున్న ఓ బుల్లి అభిమానిని స్వయంగా కలిసి పరామర్శించాడు.
తొమ్మిదేళ్ల మణి కుశాల్ కొంత కాలంగా క్యాన్సర్ తో బాధపడుతున్నాడు. మణి కుశాల్ అభిమాన హీరో రామ్ చరణ్. ప్రస్తుతం ఆ చిన్నారి హైదరాబాదులోని స్పర్శ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా, జీవితంలో ఒక్కసారైనా రామ్ చరణ్ ను కలవాలని ఆ చిన్నారి తన కోరికను తల్లిదండ్రులకు తెలిపాడు. క్యాన్సర్ తో పోరాడుతున్న మణి కుశాల్ విషయాన్ని మేక్ ఏ విష్ ఫౌండేషన్ ప్రతినిధులు రామ్ చరణ్ కు తెలియజేశారు. బాలుడి పరిస్థితి తెలుసుకుని చలించిపోయిన రామ్ చరణ్ స్పర్శ్ ఆసుపత్రికి వెళ్లారు. చికిత్స పొందుతున్న మణి కుశాల్ తో మాట్లాడి అతడికి ఆనందం కలిగించారు.

ధైర్యంగా ఉండాలని మణికి చెప్పడంతో పాటు బాలుడికి చరణ్ ఓ కానుక కూడా ఇచ్చారు. దీనికి సంబంధించిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో సందడి చేస్తున్నాయి. బాబుకి క్యాన్సర్ నుంచి పోరాడే బలాన్ని మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అందిచాడని పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇక రామ్ చరణ్ అభిమానులు చెర్రీ మంచి మనసు చూసి పొగుడుతున్నారు. మా చెర్రీ బంగారం అంటూ కామెంట్స్ పెడుతున్నారు. ఇదిలా ఉంటే రామ్ చరణ్ ప్రస్తుతం సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో RC15 సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాపై అందరిలో భారీ అంచనాలు ఉన్నాయి.