బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 ఎంతో ఉత్సాహంగా కొనసాగుతోంది. ఈ క్రమంలోనే తాజాగా ప్రియాంక సింగ్ అలియాస్ పింకీ ఈ వారం ఇంటి నుంచి ఎలిమినేట్ అయింది. బయటకు వచ్చాక తోటి బిగ్ బాస్ హౌస్ మేట్లతో కలిసి పింకీ సంబురాల్లో పాల్గొంది. ఈ క్రమంలో ఆమె పాల్గొన్న ర్యాలీలో జెస్సీ కూడా చేరాడు. అందరి ముందు అతనికి ముద్దు పెట్టిన పింకీ ఆశ్చర్యానికి గురి చేసింది.
బిగ్ బాస్ ఇంట్లో 13 వారాల పాటు ఉన్నందుకు గాను ప్రియాంక సింగ్ ఏకంగా రూ.26 లక్షలు తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇక ఆమె బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చాక గతంలో కన్నా బాగా పాపులర్ అయింది. ఆమెకు ఫ్యాన్స్ కూడా పెరిగిపోయారు. తాజాగా మెగా బ్రదర్ నాగబాబు కూడా ప్రియాంక సింగ్‌ను ఉద్దేశించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.
బిగ్‌బాస్ తెలుగు సీజన్ 5 ప్రారంభంలోనే ప్రియాంక సింగ్‌కు నాగబాబు మద్దతునిచ్చారు. ఆమె ఈ సీజన్‌లో గెలవాలని అన్నారు. అప్పట్లో ప్రియాంక సింగ్ ట్రాన్స్‌జెండర్‌గా మారేందుకు అవసరం అయిన సహాయాన్ని కూడా నాగబాబు అందజేశారు. ఈ విషయాన్ని పింకీ స్వయంగా వెల్లడించింది.
బిగ్‌బాస్ నుంచి ఎలిమినేట్ అయిన అనంతరం పింకీ తాజాగా నాగబాబును కలిసి ఆయన ఆశీర్వాదం తీసుకుంది. ఈ సందర్భంగా నాగబాబు పింకీని ప్రశంసించారు. ఎన్నో అసమానతలు, అడ్డంకులు, అవమానాలను ఎదుర్కొని నువ్వు సంపాదించిన ఈ గొప్ప స్థానం ప్రజల హృదయాలలో ఎప్పటికీ నిలిచి ఉంటుంది. నువ్వు బిగ్‌బాస్ టైటిల్ గెలవకపోవచ్చు. కానీ సమాజంలో నిత్యం నీలా అవమానాలు, హేళనలను ఎదుర్కొనే వారికి నువ్వు ఒక స్ఫూర్తిగా నిలిచావు. జీవితంలో గెలవొచ్చన్న ఆత్మవిశ్వాసాన్ని వారికి అందించావు. నా ప్రేమాభిమానాలు, మద్దతు నీకు ఎప్పుడూ ఉంటాయి.. అని నాగబాబు చెప్పారు. కాగా గతంలో నాగబాబు జడ్జీగా వ్యవహరించిన జబర్దస్త్ షోలో ప్రియాంక కూడా పాల్గొంది.