Manchu Manoj in OTT : మంచు మోహన్ బాబు ముద్దుల తనయుడు మనోజ్ గురించి తెలుగు ప్రేక్షకులకి పరిచయాలు అక్కర్లేదు. ఆయన ఎన్నో సినిమాలలో నటించి ప్రేక్షకులని అలరించాడు. ఒకప్పుడు తన సినిమాలతో ఎంతగానో అలరించిన మంచు మనోజ్ కొన్నాళ్లుగా సైలెంట్ అయ్యాడు. అయితే ఇప్పుడు తిరిగి తన సత్తా చాటేందుకు ప్రయత్నిస్తున్నాడు. సినిమాలు చేస్తూనే, ఓటీటీ ద్వారా అలరించడానికి రెడీ అయ్యాడు. గతంలో బుల్లితెరపై బిగ్ బాస్ రియాలిటీ షో ద్వారా నాని, జూనియర్ ఎన్టీఆర్‌లు హోస్ట్‌లుగా అదరగొట్టారు. నాగార్జున అలరిస్తూనే ఉన్నారు. మీలో ఎవరు కోటీశ్వరుడుతో చిరంజీవి, అన్ స్టాపబుల్ సిరీస్‌తో బాలయ్య సందడి చేస్తుండడం మనం చూశాం.
ఇక టాలీవుడ్ యువ హీరోలు రానా, విశ్వక్ సేన్ వంటి యంగ్ హీరోలు పలు షోలను హోస్ట్ చేసిన సంగతి విదితమే. ఇప్పుడు ఈ జాబితాలోకి రాకింగ్ స్టార్ మంచు మనోజ్ చేరాడు.ఈటీవీ విన్ యాప్ లో మనోజ్ హోస్ట్ చేయనున్న థ్రిల్లింగ్ గేమ్ షో “ఉస్తాద్”. ఈ షో ఫస్ట్ లుక్ పోస్టర్ తో ఆసక్తి రేపిన తాను ఎప్పటి నుంచి ఓటిటి వీక్షకులని పలకరిస్తాడు అనేది కన్ఫర్మ్ అయ్యిపోయింది. డిసెంబర్ 15 నుంచి ఈ షోని స్ట్రీమింగ్ కి తీసుకురానున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వారు నిర్మాణం వహించడం విశేషం.ఈ షో గెలిచిన ప్లేయర్స్‌కు.. రూ. 50 లక్షల ప్రైజ్ మనీ ఇవ్వబోతున్నారు. ఇప్పటి వరకు వెండితెరపై అలరించిన ఈ రాకింగ్ స్టార్.. ఇక ఓటీటీ, టీవీ ప్రేక్షకులకు దగ్గర కానున్నారు.

తాజాగా ఈ షోకి సంబంధించిన ప్రోమో ఆకట్టుకుంది. ఈ సందర్భంగా వంశీ కృష్ణ మాట్లాడుతూ.. మనోజ్ కావాలనే బ్రేక్ తీసుకున్నారని చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా మనోజ్ మాట్లాడుతుంటే మౌనిక భావోద్వేగానికి గురయ్యారు. ఇందులో ‘నేను మీ మనోజ్.. నా కథ మీరు రాసుకున్నది, నా రాక మీరు పిలుస్తున్నది‘ అంటూ తన ఫ్యాన్స్ కోసం ఓ రిటర్న్ గిఫ్ట్ రూపంలో ఈ షో ద్వారా తిరిగి రాబోతున్నారని చెప్పుకు వచ్చారు. ఇక సినిమాల విషయానికి వస్తే.. అహం బ్రహ్మస్మి, వాట్ ది ఫిష్ అనే సినిమాలు చేస్తున్నాడు. ఈ సినిమాలు ఎప్పుడు ప్రేక్షకుల ముందుకు వస్తాయో తెలియాల్సి ఉంది. మొత్తానికి మనోజ్ రానున్న రోజులలో తన అభిమానులని ఎంటర్‌టైన్ చేసేందుకు సిద్ధమయ్యాడు.