Mahesh Babu : తెలుగు సినీ పరిశ్రమకు ఏం జరిగిందో అర్ధం కావడం లేదు. ఒకవైపు లెజండరీ నటులు మరణించడం, మరోవైపు స్టార్స్ గాయపడడం జరుగుతోంది. తాజాగా సూపర్‌స్టార్ మహేశ్ బాబు సర్జరీ కోసం అమెరికా వెళ్లనున్నారు. గత కొన్నిరోజులుగా ఆయన మోకాలికి సంబంధించిన సమస్యతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. సర్కారు వారి పాట సినిమా షూటింగ్ సమయంలో మోకాలికి మైనర్ గాయం కావడంతో శస్త్రచికిత్స కోసం మహేశ్ యూఎస్‌కి వెళ్లనున్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఆయన నటిస్తున్న సర్కారు వారి పాట షూటింగ్‌కు బ్రేక్ పడనుంది.
మహేష్ బాబు అభిమానులు ఆయన గాయం నుంచి త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు. అంతేకాదు ట్విట్టర్ లో #getwellsoonmaheshbabuanna అనే హాష్ టాగ్ కూడా ట్రెండ్ అవుతోంది. అయితే మోకాలి గాయం కారణంగా మహేష్ రెండు నెలల పాటు సినిమా షూటింగ్స్‌కి దూరంగా ఉండనున్నారట. గతంలో కూడా మహేష్ మోకాలి నొప్పి గాయంతో బాధపడిన సంగతి తెలిసిందే.
2014 నుంచి మోకాలి సంబంధించిన సమస్యలు ఉన్నాయి. అప్పుడు విశ్రాంతి తీసుకుని తిరిగి షూటింగ్ లో పాల్గొన్నారు. అప్పుడే సర్జరీకి వెళ్లక పోవడంతో ఇప్పుడు ఆ బాధ మరింత అధికమయినట్లు సమాచారం. మరి కొద్ది రోజులలోనే ఆయన యూఎస్ ఫ్లైట్ ఎక్కనున్నట్టు తెలుస్తోంది. పరశురామ్ దర్శకత్వంలో రూపొందుతోన్న సర్కారివారి పాట సినిమా 2022 ఏప్రిల్ 1న విడుదల కానుంది. ఈ సినిమాలో మహేష్ బాబు సరసన కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోంది.