Chiranjeevi : కొన్ని సినిమాలు సమాజంలో ఉన్న వాస్తవ స్థితి గతులను ప్రతిబింబించేలా ఉంటాయి. ఇక సమాజంలో గౌరవప్రదమైన వృత్తుల్లో ఒకటైన ఉపాధ్యాయ వృత్తిపైనా అనేక సినిమాలు వచ్చాయి. అందులోనూ తెలుగు సినీ ఇండస్ట్రీలో పలువురు ప్రముఖ నటులు ఉపాధ్యాయులుగా నటించి ప్రేక్షకుల ఆదరాభిమానాలను చూరగొన్నారు. తమ విద్యార్థులను వారు ప్రయోజకులుగా తీర్చిదిద్దే సన్నివేశాలతో ఆయా నటులు ప్రేక్షకులను అలరించి, నిజంగా ఉపాధ్యాయులంటే అలాగే ఉండాలని చాటి చెప్పారు. తెలుగు సినీ ఇండస్ట్రీలో ఉపాధ్యాయుడి కథాంశంతో వచ్చిన పలు ముఖ్యమైన సినిమాలను ఒక్కసారి పరిశీలిస్తే..
విశ్వవిఖ్యాత నట సార్వభౌమ, స్వర్గీయ ఎన్‌టీఆర్ ఉపాధ్యాయుడి పాత్రలో 1972లో విడుదలైన చిత్రం బడి పంతులు. ఇందులో ఎన్‌టీఆర్ నిజాయితీ కలిగిన ఒక సగటు స్కూల్ టీచర్‌గా కనిపించి అలరించారు. తన సొంత పిల్లలే తమను ఇంటి నుంచి వెళ్లగొడితే తన వద్ద విద్యనభ్యసించిన ఓ విద్యార్థి ప్రయోజకుడై, పోలీస్ అధికారి రూపంలో తిరిగి వచ్చి తనకు చిన్నప్పుడు చదువు చెప్పిన ఆ మాష్టారుకు ఇల్లు కొనిస్తాడు. ఈ మూవీలో ఉపాధ్యాయుడు, విద్యార్థుల మధ్య ఉండే అనుబంధాన్ని చక్కగా చూపించారు. ఉపాధ్యాయుడి పాత్రలో ఎన్టీఆర్ అదరహో అనిపించేలా నటించారు.
కె.రాఘవేంద్ర రావు దర్శకత్వంలో వచ్చిన సుందరకాండ మూవీలో వెంకటేష్ ఉపాధ్యాయుడి పాత్రలో కనిపించి అలరించాడు. ఓ విద్యార్థిని తనను ప్రేమిస్తే గురు శిష్యుల మధ్య అలాంటి సంబంధం ఉండడం కరెక్ట్ కాదని చెప్పిన టీచర్ పాత్రలో వెంకటేష్ అద్భుతంగా నటించాడు.
చెడ్డ దారులు పట్టి, చదువు సరిగ్గా చదవకుండా చిల్లర వేషాలు వేసే విద్యార్థులను సరైన దారిలో పెట్టే లెక్చరర్ పాత్రలో చిరంజీవి మాస్టర్ సినిమాలో అద్భుతంగా నటించారు. నిజంగా ఉపాధ్యాయుడు అంటే.. ఇలాగే ఉండాలని ఆయన సినిమా చాటి చెబుతుంది.
పిల్ల జమీందార్ సినిమాలో ఎంఎస్ నారాయణ క్యారెక్టర్ కొన్ని సార్లు కామెడీ పండించినా.. ప్రధాన పాత్రలో నటించిన నాని క్యారెక్టర్‌కు జీవితమంటే ఏంటో తెలిసేలా చేస్తారు. మనిషి జీవించినంత కాలం విలువలతో బతకాలనే జీవిత పాఠాలను ఎంఎస్ నారాయణ విద్యార్థులకు బోధిస్తారు. ఆయన లాంటి ఉపాధ్యాయులు నిజ జీవితంలో మనకు చాలా అరుదుగా కనిపిస్తారు.
నటుడిగా రాజేంద్ర ప్రసాద్ గురించి పెద్దగా చెప్పాల్సిన పనిలేదు. ఏ క్యారెక్టర్‌ను అయినా అవలీలగా చేసేయగల ప్రతిభ ఆయన సొంతం. అలాగే ఓనమాలు మూవీలోనూ ఆయన రిటైర్డ్ ఉపాధ్యాయుడిగా అద్భుతంగా నటించారు. టీచర్‌గా రిటైర్ అయి కొడుకుతో అమెరికాలో సెటిల్ అయినా.. సొంత ఊరిని మార్చడం కోసం వృద్ధాప్యంలోనూ తిరిగి తన ఊరికి వస్తాడు. తన ఊరిని మారుస్తాడు. తన ఊరికి ఆయన మళ్లీ ఉపాధ్యాయుడు అవుతారు. అలా ఆ పాత్రలో రాజేంద్ర ప్రసాద్ అలరించారు.