Bigg Boss 5 : బుల్లితెర ప్రేక్షకులని ఎంతగానో అలరిస్తున్న బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 5 కార్యక్రమం ఆదివారం పూర్తైంది. ఈ షోలో సన్నీ విజేతగా నిలిచాడు. షణ్ముఖ్ రన్నరప్ గా నిలవగా శ్రీరామ్ మూడో స్థానంలో నిలిచాడు. ఎంతో అట్టహాసంగా ముగిసిన ఫినాలే కార్యక్రమం ప్రేక్షకులని ఎంతగానో అలరించింది. టైటిల్ విజేత ట్రోఫీతోపాటు టీవీఎస్ బైక్, సువర్ణ భూమి ఇన్‌ఫ్రాస్టక్చర్ నుంచి షాద్‌నగర్‌లో రూ.25 లక్షల విలువ చేసే 300 చదరపు గజాల భూమిని గెలుచుకున్నాడు.
కరోనా వలన బిగ్ బాస్ కార్యక్రమం జరుగుతుందో లేదో అని ఎన్నో అనుమానాలు ఉన్నా కూడా అనేక జాగ్రత్తలు తీసుకుంటూ కార్యక్రమాన్ని సక్సెస్ ఫుల్ గా నడిపిస్తున్నారు. అయితే ఒక సీజన్ కి మరో సీజన్‌కి మధ్య 5 నుంచి 6 నెలలు లేదా అంతకంటే ఎక్కువ సమయం పడుతోంది. దీంతో నెక్ట్స్ సీజన్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఆడియన్స్‌కు నాగ్ తీపి కబురు అందించారు.
సాధారణంగా ఒక సీజన్ అయిపోగానే కొత్త సీజన్ స్టార్ట్ అవ్వడానికి 5 నెలలు పడుతుంది. కానీ ఈసారి మీకు మరింత వినోదం పంచేందుకు బిగ్‌బాస్ 6 సీజన్‌ను అంతకు ముందే మీ ముందుకు తీసుకురాబోతున్నాము. కొత్త సంవత్సరం మొదలైన రెండు నెలలకు బిగ్‌బాస్ కొత్త సీజన్ మొదలు కానుందని చెప్పి అందరనీ సంతోషింపజేశారు నాగార్జున. అంటే నాగార్జున చెప్పిన దాని ప్రకారం చూస్తే కొత్త సంవత్సరం వచ్చిన రెండు నెలలకు అంటే మార్చి లేదా ఏప్రిల్ నెలల్లో బిగ్‌బాస్ 6 సీజన్ స్టార్ట్ కానున్నట్టు అర్థమవుతోంది. మరి దీనిపై అధికారిక ప్రకటన ఎప్పుడు చేస్తారో చూడాలి.