సాధారణంగా వినాయక చవితి రోజు భక్తులు పెద్ద ఎత్తున వినాయకుడి విగ్రహాలను ఇంటికి తెచ్చుకొని పూజా కార్యక్రమాలను నిర్వహిస్తారు. ఈ విధంగా వినాయకుడికి ఎంతో భక్తి శ్రద్దలతో పూజలు చేసి స్వామి వారి అనుగ్రహాన్ని పొందుతారు. స్వామివారికి పూజ చేయడం కోసం భక్తులు తమ స్థోమతకు అనుగుణంగా విగ్రహాలను తెచ్చుకొని పూజిస్తారు. అయితే స్వామి వారికి పూజ చేయడం కోసం ఏ సైజు విగ్రహాన్ని తీసుకురావాలి, ఆ విగ్రహాలకు ఏ విధంగా పూజ చేయాలి ? అనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.
సాధారణంగా మన ఇంట్లో పూజ గదిలో నిత్య దీపారాధన కోసం వినాయకుడి విగ్రహాన్ని పెట్టుకోవాలి అనుకునేవారు ఇంటి యజమాని బొటనవేలు సైజులో ఉన్న విగ్రహాన్ని మాత్రమే నిత్య పూజకు ఉపయోగించాలి. అదేవిధంగా వినాయక వ్రతాన్ని చేసే సమయంలో వినాయకుడి విగ్రహం అరచేతి పొడవు ఉండాలి. ఈ విధమైన వినాయకుడి విగ్రహాన్ని కేవలం వినాయకుడి వ్రతం చేసే సమయంలో మాత్రమే ఉపయోగించాలి.
వినాయక చవితి పండుగ రోజులలో ఎంత పెద్ద విగ్రహాన్ని తీసుకోస్తే పూజలు కూడా అదే స్థాయిలో నిర్వహించాల్సి ఉంటుంది. పెద్ద విగ్రహాలను తెచ్చి పెట్టడం వల్ల నిత్యం దూప దీపారాధన, అన్నప్రసాదాలు, నైవేద్యాలు సమర్పిస్తూ, భజనలు చేస్తూ, స్వామి వారి కథలను వినిపించాలి. ఇలా పెద్ద విగ్రహాలను తీసుకువస్తే పెద్ద ఎత్తున పూజా కార్యక్రమాలను నిర్వహించవలసి ఉంటుంది. ఈ క్రమంలోనే వీలైనంతవరకు వినాయకుడి ప్రతిమలను భారీ స్థాయిలో కాకుండా చిన్న సైజులో ఉన్న వాటిని తీసుకురావడం ఎంతో ఉత్తమమని పండితులు చెబుతున్నారు. ముఖ్యంగా ఎలాంటి రసాయనాలు వాడకుండా సహజసిద్ధంగా బంక మట్టితో తయారు చేసిన విగ్రహాలను తీసుకురావడం శ్రేయస్కరం. ఈ విధంగా వినాయకుడి విగ్రహాలను ప్రతిష్టించి భక్తి శ్రద్ధలతో పూజ చేయటం వల్ల స్వామివారి కరుణా కటాక్షాలు ఎల్లప్పుడూ మనపై ఉంటాయి.