Ravi Chettu Puja : మన దేశంలో ఉన్న ఏ ఆలయంలోకి వెళ్లినా అక్కడ రావి చెట్టు కచ్చితంగా ఉంటుందని అందరికీ తెలిసిందే. ఆ చెట్టును దైవానికి ప్రతిరూపంగా భావిస్తారు. ఆ చెట్టు వేర్లలో బ్రహ్మ, కాండంలో విష్ణువు, ఆకుల్లో శివుడు ఉంటాడట. అందుకే రావి చెట్టును భక్తులు పూజిస్తారు. ఈ క్రమంలో రావి చెట్టు వల్ల మనకు ఆయుర్వేద పరంగా ఎన్నో ఉపయోగాలు కూడా ఉన్నాయి. అయితే రావి చెట్టును భక్తులు అంత నమ్మకంగా పూజించడానికి గల పలు కారణాలు తెలుసుకుందాం. వాటిలో పురాణాల ప్రకారం కొన్ని ఉంటే, సైంటిఫిక్ పరంగా ఓ కారణం ఉంది. అవేమిటంటే..
పైనే చెప్పాం కదా. రావి చెట్టు వేర్లలో బ్రహ్మ, కాండంలో విష్ణువు, ఆకుల్లో శివుడు ఉంటాడని. దీన్ని గురించి శ్రీకృష్ణుడు చెప్పాడట. ఇదే విషయం భగవద్గీతలో కూడా ఉందట. అందుకే భక్తులు రావి చెట్టును పూజిస్తున్నారు. సకల దేవుళ్లు, దేవతలు రావి చెట్టులో కొలువై ఉంటారట. అందు వల్లనే ఆ చెట్టును దైవంగా భావించి పూజిస్తున్నారు. జంతువులు, పక్షులు, చెట్లు, ప్రాణులు అన్నీ రావి చెట్టులోనే పుట్టాయట. అందువల్ల కూడా భక్తులు ఆ చెట్టును పవిత్రంగా భావిస్తారు. రావి చెట్టుకు నీరు పోసి పూజ చేస్తే ధనం సిద్ధిస్తుందట. అనారోగ్యం నయమవుతుందట. కాల సర్ప దోషం పోతుందట. అందుకే ఆ చెట్టును అందరూ పూజిస్తారు.

రావి చెట్టు కింద కూర్చుని హనుమాన్ చాలీసా చదివితే సమస్యలన్నీ పోతాయట. ప్రతి రోజూ ఆ చెట్టు కింద కూర్చుని కొంత సేపు దైవాన్ని ప్రార్థిస్తే అలాంటి వారికి ఎలాంటి సమస్యలు రావట. రావి చెట్టు కింద రోజూ ఆవ నూనెతో దీపాన్ని వెలిగిస్తే మంచిదట. అంతా శుభమే జరుగుతుందట. రావి చెట్టు కింద పడుకుని నిద్రిస్తే ఆ చెట్టు నుంచి వచ్చే గాలికి ఎన్నో అనారోగ్య సమస్యలు నయమవుతాయట. అందుకనే ఆ చెట్టును పవిత్రంగా భావించి పూజలు చేస్తారు.