వినాయకుడికి అనేక పేర్లు ఉన్న విషయం విదితమే. గణేషుడు, గణనాథుడు, విఘ్నేశ్వరుడు, పార్వతీ తనయుడు.. ఇలా రక రకాల పేర్లతో ఆయనను పిలుస్తారు. అలాగే ఏకదంతుడు అని కూడా అంటారు. మరి వినాయకుడికి ఏకదంతుడు అనే పేరు ఎలా వచ్చిందో ఇప్పుడు తెలుసుకుందామా..!
కార్తవీర్యుని వధించిన అనంతరం పరశురాముడు తన గురువు అయిన పరమశివుడిని దర్శించుకోవాలని కైలాసం వెళ్తాడు. ఆ సమయంలో పార్వతీ పరమేశ్వరులు ఏకాంతంలో ఉంటారు. బయట గణేషుడు కాపలాగా ఉంటాడు. అయితే లోపల తన తల్లిదండ్రులు ఏకాంతంలో ఉన్నారని, ఇప్పుడు వారిని దర్శించుకోవడం కుదరదని అక్కడికి వచ్చి పరశురామున్ని గణేషుడు అడ్డగిస్తాడు.
దీంతో పరశురాముడికి, గణేషుడికి మాటా మాటా పెరుగుతుంది. ఇద్దరూ యుద్ధానికి దిగుతారు. గణేషుడు తన తొండంతో పరశురామున్ని ఎత్తి పడేస్తాడు. దీంతో ఆగ్రహించిన పరశురాముడు తన చేతిలో ఉన్న గండ్ర గొడ్డలిని గణేషుడిపైకి ప్రయోగిస్తాడు. ఈ క్రమంలో వినాయకుడికి ఉండే ఒక దంతం ఊడిపోతుంది. ఆ చప్పుడుకు పార్వతీ పరమేశ్వరులు బయటకు వస్తారు. ఈ క్రమంలో శాంతించిన పరశురాముడు తప్పు జరిగిపోయిందని, క్షమించాలని వేడుకుంటాడు. తరువాత అక్కడి నుంచి వెళ్లిపోతాడు. ఈ విధంగా ఆ సంఘటన అనంతరం గణేషుడికి ఒకే దంతం ఉంటుంది. అందువల్ల ఆయన ఏక దంతుడు అయ్యాడు.