Vinayaka Chavithi : వినాయక చవితి పండుగను పురస్కరించుకుని శనివారం భక్తులు పెద్ద ఎత్తున గణేష్ నవరాత్రి ఉత్సవాలను ప్రారంభించేందుకు ఇప్పటికే అనేక ఏర్పాట్లు చేశారు. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 1 గంట మధ్య పూజకు ముహుర్తం ఉంది. కనుక ఆ సమయంలో చాలా మంది గణపతిని ప్రతిష్టించి పూజలు చేస్తారు. ఇక వినాయకుడికి అత్యంత ఇష్టమైన ఉండ్రాళ్లు, మోదకాలను నైవేద్యంగా ఆయనకు సమర్పించి మనం ఏదైనా కోరుకుంటే దాన్ని ఆ వినాయకుడు నెరవేరుస్తాడని చెబుతారు. కనుక ఆయనకు వాటిని నైవేద్యంగా పెట్టడం మరిచిపోకండి.
ఇక వినాయక చవితి రోజు చేయాల్సిన అతి ముఖ్యమైన పనుల్లో ఒకటి. ఈ రోజు ఎట్టి పరిస్థితిలోనూ మీరు రాత్రి పూట చవితి చంద్రున్ని చూడకండి. ఎందుకంటే చవితి నాడు చంద్రున్ని చూస్తే నీలాపనిందల పాలు కావల్సి వస్తుంది. దీని వెనుక ఒక కథ కూడా ఉంది. సకల దేవతలచే పూజలందుకున్న గణేషుడికి అందరూ పిండి వంటకాలతో భోజనం పెడతారు. దీంతో సహజంగానే భోజన ప్రియుడు అయిన గణేషుడు విందును భారీ ఎత్తున ఆరగించేస్తాడు. తరువాత అజీర్తి సమస్యతో బాధపడుతుంటాడు.

అలాంటి గణేషున్ని చూసిన చంద్రుడు ఫక్కున నవ్వుతాడు. దీంతో పార్వతీ దేవి ఆగ్రహిస్తుంది. చంద్రున్ని చూసిన వారందరూ నీలాపనిందల పాలు కావల్సి వస్తుందని శాపం పెడుతుంది. అయితే తాను తప్పు చేశానని, క్షమించమని కోరుతూ చంద్రుడు పార్వతీ దేవిని ప్రార్థిస్తాడు. దీంతో ఆమె తాను పెట్టిన శాపాన్ని కాస్త సవరిస్తుంది. కేవలం వినాయక చవితి రోజు మాత్రమే చంద్రున్ని చూస్తే నీలాపనిందల పాలు అవుతారు.. అని చెబుతుంది. ఇక అప్పటి నుంచి ఎవరూ వినాయక చవతి రోజు చంద్రున్ని చూడడం లేదు.
కానీ ఒకసారి శ్రీకృష్ణుడు గోవుకు పాలు పిండి ఆ పాలలో చంద్రుడి ప్రతిబింబాన్ని చూస్తాడు. దీంతో ఆయనపై శమంతకమణిని దొంగిలించాడనే నెపం వేస్తారు. అప్పుడు ఆయన జాంబవంతుడితో పోరాడి ఆ మణిని సాధించి తెచ్చి తిరిగి దాని యజమానికి అప్పగిస్తాడు. ఇలా కృష్ణుడు ఆయనపై పడిన నిందను పోగొట్టుకుంటాడు. కనుక చవితి నాడు చంద్రున్ని మీరు ఎట్టి పరిస్థితిలోనూ చూడకండి. లేదంటే అనవసరంగా మీరు నిందలపాలు కావల్సి వస్తుంది. కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి.