పెళ్లి చేసుకొని ఎన్నో ఆశలతో అత్తారింట్లో అడుగుపెట్టిన ఆ యువతికి తన భర్తతో ఎన్నో విభేదాలు తలెత్తాయి. వారు నివాసం ఉంటున్నది హైదరాబాద్‌లో కాగా తన భర్త బెంగళూరులో ఉద్యోగం చేస్తూ తనను సరిగా చూసుకోవడం లేదని మనస్తాపం చెందిన ఓ యువతి అత్యంత దారుణానికి పాల్పడింది. ఏకంగా తన భర్తకు వీడియో కాల్ చేసి లైవ్ లోనే ఉరేసుకుని చనిపోయింది. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే..
స్థానిక క్షేత్ర హోమ్స్ అపార్ట్‌మెంట్స్ లోని రెండో ఫ్లోర్‌లో ఉన్న 203 ఫ్లాట్ లో నాగదేవి దంపతులు ఉన్నారు. ఈమెకు పెళ్లి జరిగే కేవలం పది మాసాలు మాత్రమే అయింది. తన భర్త సాయి శివ బెంగళూరులో ఒక సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. ఈ క్రమంలోనే వారానికి రెండుసార్లు హైదరాబాద్ వచ్చేవాడు. అయితే నాగదేవి హైదరాబాద్‌లో బ్యూటీ పార్లర్ నడుపుతూ ఉండేది. తన భర్త సాయి శివ తనను సరిగా చూసుకోవడం లేదంటూ తరచూ వీరి మధ్య గొడవలు తలెత్తేవి.
ఈ క్రమంలోనే మంగళవారం ఉదయం భార్యభర్తల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. తన భర్తకు వీడియో కాల్ చేసిన నాగదేవి వీడియో కాల్ లో తన భర్త చూస్తుండగానే చీరతో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. సమాచారం అందుకున్న రంగారెడ్డి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.