ఆ వ్యక్తికి ఏ కష్టమొచ్చిందో ఏమో.. ఇంతటి కఠినమైన నిర్ణయాన్ని తీసుకున్నాడు. అతనికి ఎదురైన సమస్యల నుంచి తాను మాత్రమే ఆత్మహత్య చేసుకోకుండా తన కుటుంబ సభ్యులు కూడా ఆ కష్టాలను పడకూడదని ఆలోచించాడేమో కానీ ఎంతో కఠినమైన నిర్ణయాన్ని తీసుకున్నాడు. నెల్లూరు జిల్లా దొరవారిసత్రం మండలంలోని మోదుగులపాలెం గ్రామంలో నివసిస్తున్న మురళి అనే వ్యక్తి తన కూతురికి, తన తల్లికి విషం ఇచ్చి ఆపై తాను విషం తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
పూర్తి వివరాల్లోకి వెళితే.. కేవలం కుటుంబ కలహాలు, ఆర్థిక పరమైన సమస్యల కారణంగా మురళి అనే వ్యక్తి తన తల్లి మస్తానమ్మ, తన కూతురు కావ్య శ్రీ (11) కి విషం ఇచ్చి ఆపై తాను విషం తీసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. ఈ విషయం గమనించిన స్థానికులు అక్కడికి చేరుకునేలోపు అందరూ అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు. మురళి, తన కూతురు కావ్య కొన ప్రాణాలతో కొట్టుమిట్టాడుతుండగా వారిని మెరుగైన చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
మస్తానమ్మ వయసు పైబడటంతో అక్కడికక్కడే మృతి చెందింది. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మురళి ఆరోగ్య పరిస్థితి విషమించడంతో మృతి చెందాడు. ప్రస్తుతం కావ్య పరిస్థితి కూడా విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. ఈ విధంగా కుటుంబ కలహాల కారణంగా కుటుంబ సభ్యులు మొత్తం విషం తీసుకుని ఆత్మహత్యకు పాల్పడటంతో గ్రామంలో విషాద ఛాయలు నెలకొన్నాయి. ఈ క్రమంలోనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.