జీవితం అంటే 100 ఏళ్ల పంట. ఇక్కడ 100 ఏళ్ల పాటు జీవిస్తాం అని కాదు, కానీ అంత విలువైందని అర్థం. కానీ అలాంటి జీవితం విలువను కొందరు సరిగ్గా అర్థం చేసుకోలేకపోతున్నారు. చిన్నపాటి కారణాలకే క్షణికావేశంలో బలవంతపు నిర్ణయాలను తీసుకుంటున్నారు. దీంతో కన్న తల్లిదండ్రులకు గర్భశోకం మిగులుస్తున్నారు.
తెలంగాణలో బుధవారం ఎంసెట్ ఫలితాలు విడుదలైన విషయం విదితమే. అయితే ఎంసెట్ లో అర్హత సాధించలేదని ఓ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. నల్గొండ జిల్లా కనగల్ మండలం శాబ్దుల్లా పూర్ గ్రామానికి చెందిన స్నేహ రెడ్డి అనే విద్యార్థిని నల్గొండలోని ఓ ప్రైవేట్ కాలేజీలో ఇంటర్ పూర్తి చేసింది. ఎంసెట్ రాసినప్పటికీ తాజాగా వెల్లడైన ఫలితాల్లో ఆమె అర్హత సాధించలేదు. దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన ఆమె ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్ కు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. తల్లిదండ్రులు ఆమె మరణాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ క్రమంలోనే ఆమె ఓ సూసైడ్ లెటర్ కూడా రాసింది.
అమ్మా.. నాన్నా.. నన్ను క్షమించండి. మీకు నా ముఖం చూపించలేకపోతున్నాను.. మీరు నా మీద పెట్టుకున్న ఆశలను నిలబెట్టుకోలేకపోయా.. అందుకు బాధగా ఉంది.. అందుకే మిమ్మల్ని విడిచిపెట్టి వెళ్లిపోతున్నాను.. అంటూ స్నేహ రెడ్డి సూసైడ్ నోట్ రాసింది. కాగా ఆమె తల్లి ఏఎన్ఎం గా పనిచేస్తోంది. ఈ క్రమంలోనే ఆమె విధి నిర్వహణకు వెళ్లి సాయంత్రం ఇంటికి తిరిగి వచ్చి చూడగా కుమార్తె విగతజీవిగా పడి ఉంది. దీంతో స్నేహా రెడ్డి తల్లిదండ్రులు భోరున విలపిస్తున్నారు. వారి కుటుంబంలో విషాదం నెలకొంది.