చెన్నైలో దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. కూల్ డ్రింక్ తాగిన ఓ బాలిక రక్తంలో కూడిన వాంతులు చేసుకుంది. తరువాత ఆమె వెంటనే చనిపోయింది. ఆమె శరీరం మొత్తం నీలి రంగులోకి మారిపోయింది. వివరాల్లోకి వెళితే..
చెన్నైలోని బీసెంట్ నగర్ లో స్థానిక కిరాణా దుకాణం నుండి 13 ఏళ్ల బాలిక ధరణి ఓ కూల్ డ్రింక్‌ను కొనుగోలు చేసింది. అనంతరం ఆ కూల్ డ్రింక్‌ను ఆమె తాగింది. అయితే ఆమె కూల్‌డ్రింక్ తాగాక ఆమెకు రక్తంతో కూడిన వాంతులు అయ్యాయి.
ఈ క్రమంలో ఆమె అక్క అశ్విని తమ తల్లిదండ్రులను ఇంటికి తిరిగి రమ్మని పిలిచింది. ధరణిని సమీపంలోని ఆసుపత్రికి తరలించగా అప్పటికే ఆమె మరణించినట్లు వైద్యులు ప్రకటించారు. వారు ఆసుపత్రికి చేరుకునే సమయానికి ధరణి శరీరం మొత్తం నీలం రంగులోకి మారింది.
ఈ సంఘటన తర్వాత ఆహార భద్రత అధికారులు తాత్కాలికంగా చెన్నైలోని శీతల పానీయాల తయారీ యూనిట్‌ను మూసివేశారు. తదుపరి నోటీసు వచ్చేవరకు యూనిట్ మూసివేయబడుతుందని తెలిపారు.
కాగా వివిధ దుకాణాలకు పంపిన ఒకే బ్యాచ్ కూల్ డ్రింక్ సీసాలు 540 ఉంటే వాటిని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. షాపుల నుండి బ్యాచ్‌ను అధికారులు రీకాల్ చేసే సమయానికి చెన్నై అంతటా 17 సీసాలు అమ్ముడయ్యాయి. బీసెంట్ నగర్ నివాసితులు తమ పరిసరాల్లో విక్రయించే ఉత్పత్తుల నాణ్యతను తనిఖీ చేయాలని ఆహార భద్రతా అధికారులను డిమాండ్ చేశారు.
కాగా ధరణికి ఆస్తమా ఉంది. ఆమెను కూల్ డ్రింక్స్ తాగకూడదని వైద్యులు చెప్పారు. ఈ వివరాలను పోలీసులు తెలిపారు. ఆమె మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం రాయపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోస్ట్‌మార్టం నివేదికలో, పానీయం ఆమె శ్వాసకోశ వ్యవస్థలోకి ప్రవేశించిన తర్వాత ఊపిరాడకపోవడమే మరణానికి కారణమని చెప్పబడింది.
కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. పానీయం నమూనాలను ఫోరెన్సిక్ పరీక్ష కోసం పంపినట్లు పోలీసులు తెలియజేశారు. షోలవరంలోని తయారీ యూనిట్ అధికారులను త్వరలో ప్రశ్నించనున్నారు.