ఆ మహిళ నిండు గర్భిణి. మరికొన్ని రోజులలో ఓ పండంటి బిడ్డకు జన్మనివ్వబోతున్న క్రమంలో కఠినమైన నిర్ణయం తీసుకుంది. తాను పడుతున్న కష్టాలు తన బిడ్డ పడకూడదన్న ఉద్దేశంతో ఆ బిడ్డ భూమిపైకి రాకముందే పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన మంచిర్యాల జిల్లాలో చోటు చేసుకుంది. పూర్తి వివరాల లోకి వెళ్తే..
మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలం, ఒత్కులపల్లి గ్రామానికి చెందిన రమ్య అనే యువతిని అదే మండలం నర్సింగాపూర్‌కు చెందిన రాజశేఖర్ అనే యువకుడికి ఇచ్చి గతఏడాది వివాహం చేశారు. వీరి వివాహ సమయంలో యువతికి రూ.2 లక్షల కట్నంతోపాటు బంగారం, ఒత్కులపల్లిలో కొంత భూమిని కట్నంగా ఇచ్చారు. పెళ్లి తర్వాత కొన్ని రోజుల పాటు ఎంతో సుఖంగా సాగిన తన జీవితంలో కష్టాలు మొదలయ్యాయి. తన పేరుపై ఉన్న పొలం అమ్మి డబ్బులు తీసుకురావాలని ఇంట్లో తన భర్త, అత్తమామలు వేధించడం మొదలుపెట్టారు.
ఈ క్రమంలోనే ఆమె భర్త కూడా తనను అదనపు కట్నం తేవాలని రోజూ హింసలు పెట్టేవాడు. రమ్య గర్భం దాల్చగా పరిస్థితులు సద్దుమణుగుతాయని భావించింది. అయితే రోజు రోజుకూ ఆమెను అధిక వేధింపులకు గురి చేయడంతో ఎంతో మానసికంగా కుంగిపోయిన రమ్య పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసుకుంది. విషయం తెలుసుకున్న భర్త, తన కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే పరిస్థితి విషమించి ఆమె మృతి చెందింది. రమ్య మృతికి తన అత్తింటి వారే కారణమని, గర్భవతి అని కూడా చూడకుండా తనని దారుణంగా హింసించేవారు.. అంటూ తల్లిదండ్రులు వారి అత్తింటి వారిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలోనే పోలీసులు వారిపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తును కొనసాగిస్తున్నారు.