అప్పటివరకు ఆ చిన్నారి కేరింతలతో,ముసిముసి నవ్వులతో ఎంతో సంతోషంగా ఉన్న ఆ ఇంటిలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఆ చిన్నారి కేరింతలను, ముసిముసినవ్వులను ఒక జామకాయ ముక్క దూరం చేసింది.తొమ్మిది నెలల వయసున్న ఆ చిన్నారి కింద పడిన జామ కాయ ముక్కలను నోట్లో పెట్టుకోవడంతో అది గొంతుకు అడ్డం పడి చిన్నారి మృతి చెందిన ఘటన కృష్ణాజిల్లాలో చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే..
గంటసాలకు చెందిన అనిల్ బాబు, స్వామి అనే దంపతులకు కవల ఆడ పిల్లలు కలరు. ప్రస్తుతం ఈ చిన్నారుల వయసు 9 నెలలు.ఈ క్రమంలోనే స్వామి తన పిల్లల్ని తీసుకొని లంక తోటలో తన పుట్టింటికి వెళ్ళింది. గురువారం సాయంత్రం కవలపిల్లలలో ఒకరైన వీక్షిత అనే చిన్నారి నేలపై పడిన జామ ముక్కను తీసుకొని నోట్లో పెట్టుకుంది.ఇది గమనించిన కుటుంబ సభ్యులు ఆ జామ ముక్కను బయటకు తీయడానికి ప్రయత్నించారు. అయితే అప్పటికే చిన్నారి జామ ముక్కను మింగడంతో అది గొంతుకు అడ్డంపడి ఊపిరి తీసుకోవడానికి కష్టంగా మారింది.
ఈ క్రమంలోనే కుటుంబ సభ్యులు 108 వాహనానికి ఫోన్ చేసి కృష్ణా జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ కూడా వైద్యులు ఆ జామకాయ ముక్కను బయటకు తీయడానికి ప్రయత్నాలు చేసినప్పటికీ వీలు కాలేదు. ఈ క్రమంలోనే ఊపిరాడక చిన్నారి వీక్షిత మృతి చెందింది. ఈ విధంగా చిన్నారి మృతి చెందడంతో కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.