మద్యం సేవించి వాహనాలు నడపవద్దని పోలీసులు ఎంత హెచ్చరిస్తున్నా కొందరు వినడం లేదు. పీకలదాకా మద్యం సేవించి విపరీతమైన వేగంతో నిర్లక్ష్యంగా వాహనాలను నడుపుతున్నారు. దీంతో ప్రమాదాలను కొని తెచ్చుకుంటున్నారు. ఇలాంటి వారి వల్ల వారికే కాదు రోడ్డుపై ప్రయాణించే ఇతర వాహనదారులకు కూడా ముప్పు ఏర్పడుతోంది. తాజాగా మాదాపూర్‌లోనూ ఇలాంటి సంఘటనే చోటు చేసుకుంది.
హైదరాబాద్ నగరంలోని మాదాపూర్ ఇనార్బిట్ మాల్ వద్ద దారుణమైన రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. సుజిత్, ఆశిష్ అనే ఇద్దరు యువకులు ఆడి కారులో ప్రయాణిస్తూ అత్యంత వేగంగా, నిర్లక్ష్యంగా వాహనాన్ని నడిపారు. ఈ క్రమంలో వారు మాదాపూర్ ఇనార్బిట్ మాల్ వద్ద తమ ముందు వెళ్తున్న ఆటోను కారుతో బలంగా ఢీకొట్టారు. ఈ క్రమంలో ఆటో నుజ్జయింది. అందులో వెనుక కూర్చుని ప్రయాణిస్తున్న ఉమేష్ కుమార్ తీవ్రగాయాలకు గురై అక్కడికక్కడే మృతి చెందాడు.
https://youtu.be/vVGs2A5QZNE
కాగా ఉమేష్ కుమార్ పబ్‌లో విధులు ముగించుకుని ఆ సమయంలో ఆటోలో ఇంటికి వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. అయితే కారు ముందు భాగం దెబ్బ తిన్నా లోపల ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ కావడంతో సుజిత్, ఆశిష్ లు ప్రాణాలతో బయట పడ్డారు. ఆటో డ్రైవర్ కూడా స్వల్ప గాయాలతో ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. కానీ ఆటోలో వెనుక కూర్చున్న ఉమేష్ మాత్రం మృతి చెందాడు. కాగా ఆటోను కారు ఢీకొన్న సమయంలో అక్కడే ఉన్న సీసీ కెమెరాల్లో ఆ దృశ్యాలు రికార్డయ్యాయి.