పనిచేసే ప్రదేశాల్లో మహిళలు చాలా మంది వివక్షకు లోనవుతూనే ఉంటారు. కొందరు ఉద్యోగాల పరంగా వివక్షకు గురవుతుంటారు. ఇక కొందరిని సహోద్యోగులు లేదా తమపై స్థాయి ఉద్యోగులు లైంగిక వేధింపులకు గురి చేస్తుంటారు. దీంతో చాలా మంది మహిళలు తమ బాధను ఎవరితోనూ చెప్పుకోలేక తీవ్రంగా సతమతం అవుతుంటారు. కానీ ఆ మహిళ మాత్రం చూస్తూ ఊరుకోలేదు. తన పట్ల అసభ్యంగా ప్రవర్తించిన తన బాస్‌కు తగిన గుణపాఠం చెప్పింది. వివరాల్లోకి వెళితే…
చైనాలోని హెయిలోంగ్ జియాంగ్ ప్రావిన్స్ సుయిహువా జిల్లాలో ఉన్న ఓ ప్రభుత్వ రంగ సంస్థలో జవూ అనే మహిళ పనిచేస్తోంది. ఆమె బాస్ వాంగ్ ఎప్పుడూ ఆమెతో అసభ్యంగా ప్రవర్తించేవాడు. ఫోన్ కాల్స్ చేసేవాడు. అసభ్యకర మెసేజ్‌లు పంపించేవాడు. అయితే ఆమె ఇటీవలే ఒక రోజు అతని భరతం పట్టేందుకు సిద్ధమైంది. ఉన్న పళంగా అతని సీట్ వద్దకు వెళ్లి అతనిపై ఫ్లోర్ తుడిచే మాప్‌తో దాడి చేసింది. అలాగే పుస్తకాలను విసిరికొట్టింది.
https://youtu.be/WtLyPq–0ts
దీంతో ఆమెను చూసి తోటి మహిళా ఉద్యోగులు ఆమె చేసిన పనికి ఆమెకు మద్దతుగా నిలిచారు. అయితే ఆ బాస్ మాత్రం తాను జోక్ చేశానని, తనను విడిచిపెట్టాలని కోరాడు. కానీ తోటి మహిళా ఉద్యోగులు మాత్రం అసభ్యంగా ప్రవర్తిస్తే జోక్ చేసినట్లు ఎలా అవుతుందని అతన్ని నిలదీశారు. ఈ క్రమంలో ఆ బాస్ విషయం ఉన్నతాధికారులకు తెలిసింది. వారు అతనిపై చర్యలు తీసుకున్నారు. ఉద్యోగం నుంచి తొలగించారు. అయితే ఆ మహిళ తన బాస్‌పై దాడి చేస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. నెటిజన్లు ఆమెకు మద్దతుగా నిలిచారు. వర్క్ ప్లేస్‌లో మహిళలు చాలా మంది ఇలాగే వేధింపులను ఎదుర్కొంటున్నారని, ఆ మహిళ అతనికి చక్కగా బుద్ధి చెప్పిందని ఆమెను ప్రశంసిస్తున్నారు.