గత సంవత్సరం నుంచి కరోనా మహమ్మారి పై పరిశోధకులు విస్తృతమైన పరిశోధనలు చేస్తున్నారు. ఈ పరిశోధనల ద్వారా ఎప్పటికప్పుడు ఈ వైరస్ గురించి కొత్త విషయాలను వెల్లడిస్తున్నారు. తాజాగా కరోనా వైరస్ గురించి ఓ ఆసక్తికరమైన విషయాన్ని పరిశోధకులు తెలియజేశారు. గత రెండు సంవత్సరాల నుంచి లేదా ఎవరికైతే శరీర వ్యాయామం చేసే అలవాటు లేదో అలాంటి వారిలో కరోనా తప్పకుండా సోకుతుందని శాస్త్రవేత్తలు నిర్ధారించారు.
ఒక అధ్యయనం ప్రకారం శారీరక శ్రమ లేని వారిలోఎక్కువ శాతం కరోనా లక్షణాలు కనిపించడమే కాకుండా మరణాల సంఖ్య కూడా వారిలోనే అధికంగా ఉన్నట్లు నిర్ధారించారు. గత రెండు సంవత్సరాల ముందు నుంచి ఎటువంటి శారీరక వ్యాయామం చేయని వారు ఈ మహమ్మారి బారిన పడి ఆస్పత్రిలో చేరుతున్నట్లు ఈ అధ్యయనంలో వెల్లడించారు.
ముఖ్యంగా శారీరక వ్యాయామం చేయనివారు, ముసలి వాళ్లు, అవయవ మార్పిడి చేసుకున్న వారిలో ఈ మహమ్మారి తీవ్రస్థాయిలో విజృంభిస్తుందని తెలిపారు. ధూమపానం, మద్యపానం, అధిక రక్తపోటు వంటి లక్షణాలు ఉన్న వారిలో కన్నా శారీరక వ్యాయామం లేనివారిలో కరోనా మహమ్మారి తిష్ట వేసుకొని కూర్చుంటుందని శాస్త్రవేత్తలు తెలిపారు.ఈ మహమ్మారి నుంచి బయటపడాలంటే తప్పకుండా శారీరక వ్యాయామం అవసరమని ఈ సందర్భంగా నిపుణులు తెలియజేశారు.