లార్డ్స్ మైదానంలో మన వాళ్లు ఇంగ్లండ్‌ను చితక్కొట్టారు అంటే.. ఏంటో అనుకున్నాం. వాహ్వా.. అన్ని జబ్బలు చరుచుకున్నాం. భారత్ కీర్తి పతాకలను మరోసారి విదేశీ గడ్డపై ఎలుగెత్తి చాటారని గర్వ పడ్డాం. కానీ లీడ్స్‌లో జరుగుతున్న టెస్టు మ్యాచ్‌లో భారత్ ఆటతీరు చూస్తే లార్డ్స్‌లో గెలిచింది మన వాళ్లేనా అన్న అనుమానం రాకమానదు. మరీ గల్లీ క్రికెట్‌లా అసలు క్రికెట్ ఆడరానట్లు చెత్త షాట్స్ ఆడి వికెట్లను సమర్పించుకున్నారు. ఇంగ్లండ్ చేతిలో ఘోర పరాభవం మూటగట్టుకున్నారు.
ఇవాళ్టి నుంచి లీడ్స్‌లో ప్రారంభమైన మూడో టెస్టులో భారత్ తొలి ఇన్నింగ్స్‌లో మరీ చెత్తగా 78 పరుగులకే ఆలౌట్ అయింది. వచ్చిన బ్యాట్స్‌మెన్ వచ్చినట్లే పెవిలియన్ బాట పట్టారు. డ్రెస్సింగ్ రూమ్‌లో ఏదో పని ఉన్నట్లు వెంట వెంటనే పరుగెత్తారు. భారత బ్యాటింగ్ లైనప్ పేకమేడలా కుప్ప కూలింది. లార్డ్స్ లో సత్తా చాటింది వీళ్లేనా అన్న అనుమానం కలుగుతోంది.
రెండో టెస్టుకు, మూడో టెస్టుకు మధ్య చాలా గ్యాప్ వచ్చింది. గ్యాప్ మాట అటుంచితే ఈ మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్‌లో భారత్ అసలు పోరాట పటిమను ప్రదర్శించలేదు. నిర్లక్ష్యపు షాట్స్ ఆడి వికెట్లను సమర్పించుకున్నారు. మరి ఇంగ్లండ్‌ను ఏ విధంగా నిలువరిస్తారు ? అన్నది చర్చనీయాంశంగా మారింది. ఈ టెస్టులో ఓడిపోతారా, డ్రాగా ముగిస్తారా.. లేదా అంచనాలను తలకిందులు చేసి గెలుస్తారా ? అన్నది చూడాలి.