ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ ఎంతో జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. కరోనా సెకండ్ వేవ్ తీవ్రమైన రూపం దాలుస్తూ రోజురోజుకు కేసుల సంఖ్య పెరుగుతుండడంతో పాటు మరణాల సంఖ్య పెరుగుతున్నప్పటికీ ప్రజలు తీవ్రమైన నిర్లక్ష్యం వహిస్తున్నారు. తాజాగా పలాస-కాశీబుగ్గ మునిసిపాలిటీ పాత జాతీయ రహదారిలో ఉన్న ఓ పకోడీ షాప్ యజమాని అనారోగ్యంతో బాధపడుతుండగా అతను కరోనా పరీక్షలు చేయించుకున్నాడు.
కరోనా నిర్ధారణ పరీక్షల అనంతరం ఆ షాపు యజమానికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయినది. ఇదే విషయమే వైద్యసిబ్బంది అతనికి ఫోన్ చేసి మీకు కరోనా పాజిటివ్ అని చెప్పగా.. అటువైపునుంచి షాపు యజమాని”పకోడీ రుబ్బు ఉందమ్మా ఇప్పుడే రుబ్బేసున్నాము అది అయ్యాక వస్తానమ్మా”అని సమాధానం చెప్పడంతో వైద్య సిబ్బంది ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యారు.
బాధితుడి మాటలు విన్న వైద్య అధికారి ఏ మాత్రం ఆలస్యం చేయకుండా హుటాహుటిన అక్కడికి చేరుకొని ఆ షాపు యజమానికి నాలుగు చివాట్లు పెట్టి అతనిని 108 లోకి ఎక్కించి ఆస్పత్రికి తరలించారు.