గోదావరి జిల్లాల్లో పులస చేపలు ఎక్కువగా లభిస్తాయన్న సంగతి తెలిసిందే. పులస పేరు వినగానే చాలా మందికి నోట్లు నీళ్లూరతాయి. పులస చేపల గురించి నిజానికి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. పుస్తెలు అమ్మి అయినా సరే పులస చేపలను తినాల్సిందే.. అనే సామెత కూడా ఎక్కువగా వినిపిస్తుంది. అయితే పులస చేపలు ఎందుకు అంత ఎక్కువ ధర ఉంటాయంటే ?
పులస చేపలు గోదావరి వరదలకు పుడతాయి. ఎర్ర నీరు ఎక్కువగా ఉంటే ఇవి ఎక్కువగా ఉంటాయి. ఇవి సముద్రం నుంచి గోదావరి నదిలోకి మారడం వల్ల కూడా వీటి రుచి మారుతుంది. అత్యంత రుచికరంగా ఉండడం వల్లే ఈ పులస చేపలకు ధర ఎక్కువగా ఉంటుంది. ఇక ఈ చేపలు కేవలం జూలై, ఆగస్ట్,సెప్టెంబర్ నెలల్లో మాత్రమే లభిస్తాయి. మిగతా సమయాల్లో దొరకవు. కనుక ఈ కారణం వల్ల కూడా వీటి రేటు ఎక్కువగా ఉంటుంది.
మిగిలిన చేపల కన్నా పులస చేప చాలా భిన్నంగా ఉంటుంది. రుచి బాగా ఉంటుంది. అందువల్లే ఈ చేపలను ఎంతటి ధర అయినా సరే పెట్టి కొంటుంటారు. పులస చేపల గురించి చాలా దేశాలకు కూడా విషయం పాకిపోయింది. కనుక చాలా మంది ఈ చేపలను కొనేందుకు ఆసక్తిని చూపిస్తున్నారు. అందుకనే ఈ చేపల ధర ఎక్కువ ఉంటోంది.
పులసలో పులస, విలస అని రెండు రకాలు ఉంటాయి. పులసలో గుడ్లు, కొవ్వు ఎక్కువగా ఉంటాయి. అందుకనే ఈ చేపల రుచి భలేగా ఉంటుంది. విలసలో గుడ్లు ఉండవు. పులస చేపల కూర రుచి సమయం గడిచే కొద్దీ మారుతుంది. సాధారణంగా ఈ చేపలను రాత్రి పూట వండి ఉదయం తింటారు. దీంతో రుచి అమోఘంగా ఉంటుంది.
పులస చేపల కోసం మత్స్యకారులు ఎంతగానో శ్రమిస్తారు. వీటికి డిమాండ్ ఎక్కువ. అందుకనే ధర ఎక్కువ పలుకుతాయి. ఈ చేపలను పట్టి ఒడ్డుకు తేగానే అక్కడే కొనుగోలు చేస్తారు. మార్కెట్ దాకా వెళ్లవు. అందువల్ల సహజంగానే ఈ చేపల రేటు ఎక్కువగానే ఉంటుంది. వీటి ధర రూ.1500 నుంచి రూ.15వేల వరకు ఉంటుంది. చాలా మంది అంత డబ్బు పెట్టి మరీ ఈ చేపలను కొంటుంటారు. వీటిని ఇతర ప్రాంతాలకు కూడా ఎగుమతి చేస్తుంటారు.
ఈ చేపలు వారం రోజులు అయినా పాడవకుండా ఉంటాయని చెబుతారు. కొన్ని రకాల వ్యాధులు ఈ చేపలను తింటే తగ్గుతాయని కూడా కొందరు విశ్వసిస్తారు. ఏది ఏమైనా ఈ సీజన్‌లో మాత్రం ఒక్కసారైనా పులస తినాల్సిందే అని చాలా మంది తింటుంటారు.