భార్యకు భర్త దైవంతో సమానం.. అని పురాణాలు చెబుతున్నాయి. మహిళలు తమ భర్తలను దైవంతో సమానంగా పూజిస్తారు. అయితే ఇక్కడ పూజ అంటే నిజంగా పూజలు చేయరు, కానీ దైవంలా చూస్తారని అర్థం. కానీ ఆ మహిళ మాత్రం నిజంగానే పూజ చేస్తోంది. తన భర్తకు గుడి కట్టించి రోజూ పూజలు చేస్తోంది.
ఆంధ్రప్రదేశ్ లోని ప్రకాశం జిల్లాకు చెందిన పద్మావతి, అంకిరెడ్డిలు దంపతులు. వారికి శివశంకర్ రెడ్డి అనే కుమారుడు ఉన్నాడు. అయితే 4 ఏళ్ల కిందట అంకిరెడ్డి యాక్సిడెంట్లో చనిపోయాడు. తరువాత కొన్ని రోజులకు అంకిరెడ్డి.. పద్మావతికి కలలో కనిపించి తనకు గుడి కట్టించాలని చెప్పాడట. దీంతో పద్మావతి గుడి కట్టించి అందులో తన భర్త విగ్రహాన్ని ఏర్పాటు చేయించింది. రోజూ పూజలు చేస్తుంటుంది.
ఇక అప్పుడప్పుడు ఆ గుడిలో ఆమె ప్రత్యేక పూజలు నిర్వహిస్తుంది. భర్త పుట్టిన రోజు నాడు కూడా ప్రత్యేక పూజలు చేస్తుంది. ప్రతి పౌర్ణమి రోజు పేదలకు అన్నదానం కూడా చేస్తుంది. పద్మావతి తల్లి కూడా తన భర్తను ఇలాగే పూజిస్తుంది. అందుకనే పద్మావతి కూడా ఆ విధంగా చేయడం ప్రారంభించింది. ఆమెకు కుమారుడు శివశంకర్ రెడ్డి కూడా సహాయం చేస్తుంటాడు.