Viral Video : ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా ప్రభావం అందరిలోనూ ఎలా ఉందో అందరికీ తెలిసిందే. ఆ మాయలో పడి కొందరు ప్రాణాలనే పోగొట్టుకుంటున్నారు. రీల్స్ పేరు చెప్పి సాహసాలు చేస్తూ లోయల్లో పడి ప్రాణాలను కోల్పోతున్నారు. అయితే ఆ వ్యక్తి అంతటి సాహసం చేయలేదు కానీ సోషల్ మీడియాలో ఫాలోవర్లు, లైకుల కోసం అత్యంత చెత్త పని చేశాడు. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే..
యూట్యూబర్ అయిన పవర్ హర్ష అలియాస్ మహాదేవ్ అనే వ్యక్తి హైదరాబాద్ లోని కూకట్‌పల్లిలో నడిరోడ్డుపై బైక్ పై వెళ్తూ రోడ్డు మీద కరెన్సీ నోట్లను వెదజల్లాడు. మరో చోట కూడా రోడ్డు మధ్యలో నిలబడి అదే పని చేశాడు. రోడ్డు మధ్యలో నిలుచుని కరెన్సీ నోట్లను ధాన్యం చల్లినట్లు చల్లాడు. అయితే డబ్బును అలా చూసే సరికి వాహనదారులు, పాదచారులు ఆ డబ్బును ఏరుకునేందుకు ఎగబడ్డారు. దీంతో దొరికినోళ్లకు దొరికినంత డబ్బు వచ్చింది.
నెటిజన్ల ఆగ్రహం..
అయితే మహాదేవ్ మొత్తంగా అలా రూ.50వేలను వెదజల్లినట్లు తెలిసింది. కానీ అతని వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అత్యంత రద్దీగా ఉండే రోడ్లపై అలా డబ్బులను విసిరితే వాటిని ఏరుకునేందుకు జనాలు ఎగబడితే ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సోషల్ మీడియాలో సబ్‌స్క్రైబర్లను పెంచుకునేందుకు అతను ఇలా చేయడం కరెక్ట్ కాదని, ఎవరికైనా ఏదైనా జరిగి ఉంటే బాధ్యత ఎవరు తీసుకుంటారు.. అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. కంటెంట్ క్రియేట్ చేసేందుకు ఇలాంటి దారి ఎంచుకోవడం సరికాదని అంటున్నారు. వెంటనే ఆ వ్యక్తిపై పోలీసులు కేసు పెట్టి చర్యలు తీసుకోవాలని అతని వీడియోలను పోలీసులకు ట్యాగ్ కూడా చేస్తున్నారు.
అయితే ఆ వ్యక్తిపై ఇప్పటి వరకు పోలీసులు మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోలేదు. కానీ యూట్యూబ్‌లో ఫేమస్ అవడం కోసమే అతను ఇలా చేస్తున్నట్లు వెల్లడించాడు. తాను రానున్న రోజుల్లో కూడా ఇలాగే చేస్తానని, రోడ్డు మీద తాను ఎంత డబ్బును వెదజల్లుతాడో కచ్చితంగా చెప్పేవారికి మంచి రివార్డులను కూడా ఇస్తానని అతను చెప్పడం విశేషం. మరి పోలీసులు ఈ విషయంపై దృష్టి సారిస్తారో లేదో చూడాలి.