Bandla Ganesh : నవంబర్ 30న జరిగిన ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ విజయఢంకా మోగించిన విషయం తెలిసిందే. ఇక చర్చోపచర్చల తర్వాత కాంగ్రెస్ హైకమాండ్ అప్పటివరకు టీపీసీసీ అధ్యక్షుడిగా ఉన్న రేవంత్ రెడ్డిని సీఎల్పీగా నాయకుడిగా ప్రమోట్ చేస్తూ తనను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించింది. ఈ రోజు మధ్యాహ్నం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇందుకోసం హైదరాబాద్ నగరం నడిబొడ్డులో ఉన్న ఎల్బీ స్టేడియం వేదికగా నిలిచింది. ఇప్పటికే కాంగ్రెస్ కార్యకర్తలు రేవంత్ అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ఇప్పటికే హైదరాబాద్ చేరకోగా, వారికి రేవంత్ రెడ్డి స్వాగతం పలికారు.
రేవంత్ రెడ్డి తెలంగాణ సీఎంగా ప్రమాణస్వీకారం చేస్తున్న నేపథ్యంలో ఇందుకు వేదికైన ఎల్బీ స్టేడియానికి వెళ్లి అక్కడే పడుకుంటానని కొద్ది రోజుల క్రితం సంచలన ప్రకటన చేసిన బండ్ల గణేష్.. అదే ఊపులో మరో ప్రకటన కూడా చేశారు. ఓ టీవీ ఛానల్ లైవ్ షోలో పాల్గొన్న బండ్ల గణేష్ తెలంగాణ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయబోతున్న రేవంత్ రెడ్డి జీవితంపై ఓ బయోపిక్ చేస్తానని బండ్ల ప్రకటించారు. రేవంత్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలి కాని ఆయన కథతో సినిమా తీస్తానని బండ్ల గణేష్ ప్రకటించారు. రేవంత్‌రెడ్డికి ఎంతో మంది విలన్లు ఉన్నారని, ఆయన్ను జైల్లో పెట్టి ఇబ్బందులు పెట్టారని బండ్ల గుర్తుచేసుకున్నారు.

రేవంత్ కు ఆకలి, కసి, కష్టం, పాలన తెలుసన్నారు. మరోవైపు ఎక్స్ లో కేటీఆర్ గన్ పట్టుకుని ఉన్న ఫోటో చూసి భయపడ్డానని బండ్ల వెల్లడించారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కాంగ్రెస్ పార్టీకి ఒక్క స్థానం కూడా రాకపోవడం బాధాకరమని బండ్ల ఆవేదన వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల్లో హైదరాబాద్‌లోనూ కాంగ్రెస్ జెండా ఎగురుతుందన్నారు. కాంగ్రెస్ అద్భుత పాలన చేస్తుందని, కాబట్టి గ్రేటర్ వాసులు కూడా ఆదరించాలని ఆయన కోరారు. నిజానికి 2018 ఎన్నికల్లోనే కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని, అలా జరగకపోతే తాను బ్లేడుతో కోసుకుంటానని అప్పట్లో గణేష్ అనడం సంచలనం సృష్టించింది.