వర్షాకాలం మొదలవడంతో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలోనే ఎన్నో రకాల అంటువ్యాధులు మనల్ని చుట్టు ముడుతాయి. వర్షాకాలం మొదలైందంటే దగ్గు, జ్వరం, జలుబు వంటి అనేక వ్యాధులు మనుషులను వెంటాడుతాయి.ఇలాంటి పరిస్థితులలో ప్రతి ఒక్కరు వారి ఆరోగ్యం పట్ల ఎంతో జాగ్రత్త వహించడం అవసరం. వర్షాకాలంలో మన ఆరోగ్యం మనం తీసుకునే ఆహార పదార్థాల పై ఆధారపడి ఉంటుంది. మరి ఈ వర్షాకాలంలో ఎలాంటి ఆహార పదార్థాలను తీసుకోవాలి.. వేటిని తీసుకోకూడదు అనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం..
వర్షాకాలంలో మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే ఎక్కువగా ఫ్రెష్ గా తయారు చేసిన సూప్, హెర్బల్ టీ, తాజా పండ్లు, కూరగాయలను అధికంగా తీసుకోవాలి. అదేవిధంగా పోషకాలు, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా లభించే కూరగాయలను తరచూ తీసుకోవాలి. అలాగే మన వంటింట్లో దొరికే మిరియాలు, లవంగాలు, దాల్చిన, యాలకులు, పుదీనా వంటి వాటితో టీ తయారు చేసుకుని తాగటం వల్ల జలుబు, దగ్గు వంటి అంటు వ్యాధుల బారిన పడకుండా ఉండటమే కాకుండా మన శరీరానికి రోగనిరోధక శక్తిని పెంపొందింప చేస్తాయి.
ఏవి తినకూడదు: వర్షాకాలంలో అధికంగా వర్షాలు పడటం వల్ల ఆకుకూరలపై ఎక్కువగా ఫంగస్ ఏర్పడి ఉంటుంది కనుక వీలైనంత వరకు ఆకుకూరలను దూరం పెట్టాలి. అదేవిధంగా నూనెలో వేయించిన ఆహార పదార్థాలను, ఈరోజు మిగిలిపోయిన కూరలను మరుసటి రోజు తినడం, ప్యాక్డ్ ఆహార పదార్థాలను తీసుకోవడం మానేయాలి. ఈ విధమైనటువంటి ఆహార పదార్థాలను తీసుకోవడం వల్ల అనేక జబ్బుల బారిన పడతారు.