పంచాయతీ, మున్సిపాలిటీ ఎన్నికల్లో లభించిన జోష్‌తో తిరుపతి ఉప ఎన్నికలో సత్తా చాటేందుకు ఓ వైపు వైకాపా రెడీ అవుతోంది. కానీ మరోవైపు బీజేపీ, జనసేనలకు గాజు గ్లాసు గుర్తు నిద్ర పట్టనీయడం లేదు. గుర్తింపు పొందిన పార్టీగా జనసేన మారలేదు. దీంతో ఆ పార్టీకి ఇంకా శాశ్వత గుర్తు లభించలేదు. అయితే ఆ పార్టీకి చెందిన గాజు గ్లాసు గుర్తును తాజాగా తిరుపతి ఉప ఎన్నిక సందర్భంగా ఇంకో అభ్యర్థికి ఎన్నికల సంఘం కేటాయించడం ఆ రెండు పార్టీలకు తలనొప్పిగా మారింది.
తిరుపతి ఉప ఎన్నికలో బీజేపీ, జనసేన పార్టీల ఉమ్మడి అభ్యర్థి గెలవడమా, ఓడడమా అనే మాట అటుంచితే ఆ రెండు పార్టీలను గాజు గ్లాసు గుర్తు ఇబ్బందులకు గురి చేస్తోంది. జనసేన తాము ఆ స్థానంలో పోటీ చేస్తామన్నా బీజేపీ పట్టుబట్టి మరీ తమ అభ్యర్థిని రంగంలోకి దించింది. అక్కడితో అంతా సద్దుమణిగింది అనుకుంటే తాజాగా గాజు గ్లాసు గుర్తు మొదటికే మోసం తెచ్చేట్లు కనిపిస్తోంది. బీజేపీ కాకుండా ఆ స్థానంలో జనసేన అభ్యర్థి ఉండి ఉంటే తమ పార్టీకే ఆ గుర్తును కేటాయించేవారు కదా ? అని జనసేన నాయకులు, కార్యకర్తలు లోలోపల బాధపడుతున్నట్లు సమాచారం.
అయితే ఇప్పుడు ఆ గుర్తును ఇంకొకరికి కేటాయించారు కనుక దాన్ని తీసేయించడం దాదాపుగా అసాధ్యమనే చెప్పవచ్చు. ఈ విషయమై బీజేపీ, జనసేనలు ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించాయి. దీంతో కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయం కోసం ఆ రెండు పార్టీలు వేచి చూస్తున్నాయి. వారికి అనుకూలంగా వస్తే ఓకే. లేదంటే ఉప ఎన్నికలో ఇబ్బందులు తలెత్తుతాయని విశ్లేషకులు అంటున్నారు.