పూర్వకాలంలో మన పెద్దలు అమ్మాయిలు దొరక్కపోతే కట్నం ఎదురిచ్చి వివాహం చేసుకునేవారు కదా. అలాగే రాజస్థాన్ కు చెందిన ఓ వ్యక్తి కూడా కట్నం ఎదురిచ్చి మరీ ఓ మహిళను పెళ్లి చేసుకున్నాడు. అయితే కొద్ది రోజులు అంతా సక్రమంగానే జరిగింది. కానీ వధువు మాత్రం పారిపోయింది. దీంతో వరుడికి షాక్ తగిలింది.
రాజస్థాన్‌లోని భారత్‌పూర్ జిల్లా బయానా పోలీస్ స్టేషన్ పరిధిలోని నగ్లా మడార్ గ్రామానికి చెందిన నారాయణ్ సింగ్ గుర్జార్ అనే వ్యక్తి ఓ మధ్యవక్తి ద్వారా సునీత అనే మహిళను మార్చి 9వ తేదీన వివాహం చేసుకున్నాడు. ఆమెది మధ్యప్రదేశ్ లోని గ్వాలియర్ జిల్లా ఘాటిగావోన్ గ్రామం. ఈ క్రమంలోనే ఆమెకు రూ.3 లక్షలను అతను ఇచ్చి ఆమెను వివాహం చేసుకున్నాడు.
అయితే మార్చి 22వ తేదీన.. అంటే సరిగ్గా పెళ్లయిన 13 రోజులకు సునీత నారాయణ సింగ్ ఇంటి నుంచి పారిపోయింది. ఆ రోజు ఉదయం అతను యథావిధిగా పని నిమిత్తం బయటకు వెళ్లాడు. సాయంత్రం ఇంటికి తిరిగి వచ్చే సరికి ఆమె లేదు. దీంతో అనుమానం వచ్చిన అతను పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వారు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. కేవలం డబ్బు కోసమే ఆమె అతన్ని పెళ్లి చేసుకుని ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు.