జీవితంలో సొంత ఇంటిని నిర్మించుకోవాలని ఎవరికైనా కల ఉంటుంది. అందుకు అనుగుణంగానే ఎవరి ఇష్టానికి తగినట్లు వారు ఇళ్లను కట్టుకుంటుంటారు. అయితే ప్రస్తుతం అన్ని రకాల మెటీరియల్ ధరలు పెరిగిపోయాయి. దీంతో ఇల్లు కట్టడం అధిక ఖర్చుతో కూడిన పనిగా మారింది. కనీసం రూ.10 లక్షలు చేతిలో లేనిదే ఇల్లు కట్టుకోలేం. అయితే మీకు 100 గజాల స్థలం ఉంటే చాలు.. అందులో కేవలం రూ.2 లక్షలకే చక్కని ఇంటిని ఎలా కట్టుకోవాలో ఆయన చెబుతున్నారు.
మల్కాజిగిరికి చెందిన విజయవర్ధన్ యాదవ్ కేవలం 100 గజాల స్థలంలోనే రూ.2 లక్షలతోనే ఇల్లు ఎలా కట్టుకోవాలో చెబుతున్నారు. ఇల్లు కట్టాలంటే సిమెంట్, ఇసుక, ఇటుక, కూలీల ఖర్చు చాలా అవుతుంది. అయితే విజయవర్ధన్ కొత్తగా అందుబాటులోకి తెచ్చిన ఇంటర్ లాకింగ్ బ్రిక్స్‌తో తక్కువ ఖర్చుతోనే ఇల్లు కట్టుకోవచ్చు. టఫీ పేరిట ఓ కంపెనీని ఏర్పాటు చేసిన ఆయన సదరు బ్రిక్స్‌ను తయారు చేసి అమ్ముతున్నారు.
ఇంటర్ లాకింగ్ బ్రిక్స్ మనకు కొత్తే. కానీ విదేశాల్లో వాటితో ఇప్పటికే చాలా మంది ఇళ్లను నిర్మించుకున్నారు. దీంతో తక్కువ సమయంలోనే ఇంటిని నిర్మించుకోవచ్చు. కూలీల అవసరం, ఖర్చులు చాలా తగ్గుతాయి. మరి అలాంటి ఇటుకలతో ఇంటిని కడితే దృఢంగా ఉంటుందా ? అని సందేహం రావచ్చు, కానీ అలా భయం చెందాల్సిన పనిలేదు. ఎందుకంటే సదరు బ్రిక్స్ ను కంకర, సిమెంట్, ఇసుక, యాష్ వంటి వాటిని మిక్స్ చేసి తయారు చేస్తారు. కనుక ఇల్లు దృఢంగానే ఉంటుంది.
ఇక ప్రస్తుతం హైదరాబాద్ నగరంలోని మల్కాజిగిరితోపాటు కొంపల్లి, సైనిక్‌పురి వంటి ఏరియాల్లో ఇంటర్ లాకింగ్ బ్రిక్స్ తో నిర్మాణాలను చేపడుతున్నారు. వీటి వాడకం పట్ల ఎక్కువగా ఆసక్తిని చూపిస్తున్నారు. ఈ క్రమంలోనే మరిన్ని ఇటుకల తయారీ పరిశ్రమలను ఏర్పాటు చేయాలని విజయవర్ధన్ యోచిస్తున్నారు. దీంతో త్వరలో మరింత మందికి ఈ ఇటుకలు అందుబాటులోకి రానున్నాయి.