మన శరీరానికి అవసరమైన పోషక విలువలతో పాటు ఎన్నో ఔషధ గుణాలు సమృద్ధిగా ఉన్న నేరేడు పండ్లు సంవత్సరంలో వేసవి ప్రారంభం నుంచి తొలకరి వర్షాలు మొదలైన రెండు మూడు వారాల వరకు మాత్రమే లభ్యమయ్యే సీజనల్ ఫ్రూట్స్. నేరేడు పండ్లను సంస్కృతంలో జంబూ ఫలం అంటారు. నేరేడు పండ్లులో విటమిన్ సి అధికంగా ఉండడంతో మన శరీరానికి అవసరమైన వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించి వర్షాకాలంలో వచ్చే అనేక సీజనల్ వ్యాధులను సమర్థవంతంగా ఎదుర్కొనవచ్చు.
నేరేడు పండ్లలో అధిక మోతాదులో సోడియం, పోటాషియం, కాల్షియం, పాస్ఫరస్, మాంగనీస్, జింక్, ఐరన్, విటమిన్ సి, రైబోఫ్లైవిన్, నికోటిన్ ఆమ్లం, కొలైన్, పోలిక్ ఆమ్లం వంటిది సమృద్ధిగా లభిస్తాయి. మధుమేహం సమస్య ఉన్న వారికి నేరేడు పండు దివ్య ఔషధంగా చెప్పవచ్చు. దీనిని రోజూ తింటే రక్తపోటును అదుపులో ఉంచి గుండె పనితీరును మెరుగుపరుస్తుంది. నేరేడు పండ్లలో కొద్దిగా ఉప్పు కలుపుకొని తినడం వల్ల జీర్ణ సమస్యలు తొలగిపోతాయి.
అయితే నేరేడు పండ్లను ఒకేసారి ఎక్కువగా తినడం వల్ల పలు అనారోగ్య సమస్యలు ఏర్పడే అవకాశం ఉందని వైద్యులు సూచిస్తున్నారు. నేరేడు పండ్లలో విటమిన్ సీ అధికంగా ఉంటుంది. కావున ఈ పండ్లను ఎక్కువగా తిన్నప్పడు మలబద్ధకం సమస్య వచ్చే అవకాశం ఉంటుంది.నేరేడు అరగడానికి ఎక్కువసమయం పడుతుంది కాబట్టి గర్భిణీలు తినకపోవడమే మంచిది. నేరేడు పండ్లను తిన్న తర్వాత చాలా మందికి నోట్లో వెగటుగా ఉండి వాంతులు వచ్చే అవకాశం ఉంటుంది. అలాంటి వారు వీటికి దూరంగా ఉండాలి. ఏ ఆహారమైనా మితంగా తింటే అది మనకు ఆరోగ్య దాయకంగా మారుతుంది.