మనుషుల స్వార్థం కోసం, వారి సంపాదన కోసం అభం శుభం తెలియని చిన్నారులను కూరగాయలను అమ్మినట్టు అమ్ముతున్న ఘటన తాజాగా మధురైలోని ఇదయం అనాధ చిన్నారుల సంక్షేమ కేంద్రంలో చోటుచేసుకుంది. ఈ శిశు సంరక్షణ కేంద్రం నుంచి ఇప్పటి వరకు 16 మంది పిల్లలను డబ్బుల కోసం అమ్మి వారందరూ కరోనాతో చనిపోయారని రికార్డులు సృష్టించినట్లు పోలీసుల విచారణలో వెలుగులోకి వచ్చింది. పూర్తి వివరాల్లోకి వెళితే..
అనాధ చిన్నారుల సంరక్షణ కేంద్రం ఇదయం ట్రస్ట్ నుంచి 16 మంది పిల్లలు మాయం అయ్యారనే ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది.ప్రస్తుతం తీవ్ర స్థాయిలో వ్యాపిస్తున్నటువంటి కరోనా మహమ్మారి అడ్డుపెట్టుకొని ట్రస్ట్ నుంచి చిన్నారులను పిల్లలు లేని దంపతులకు అమ్మి లక్షలకు లక్షలు డబ్బులు చేసుకుంటున్నారు. ఇప్పటివరకు ఈ ట్రస్టు నుంచి సుమారు 16 మంది పిల్లలను అమ్మినట్టు పోలీసుల విచారణలో తేలింది.
ఈ ట్రస్ట్ నుంచి పిల్లలను అమ్మి వారందరూ కరోనాతో మృతిచెందారని రికార్డులు సృష్టించారు. తాజాగా మధురై జిల్లాలోని మేలూరు సమీపంలోని సేక్కిపట్టికి చెందిన ఐశ్వర్య అనే 22 ఏళ్ల మహిళ తన భర్తను కోల్పోగా తన ముగ్గురు పిల్లలను ఈ ఆశ్రమంలో చేర్పించింది.ఈక్రమంలో జూన్ 13న ఐశ్వర్య మూడు ఏళ్ల మూడవ కొడుకు మాణిక్కంకి కరోనా సోకి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు అని ట్రస్ట్ నిర్వాహకుల నుంచి ఫోన్ రావడంతో ఆమె అక్కడికి చేరుకుంది.
ట్రస్ట్ నిర్వాహకుల మాటలు నమ్మశక్యంగా లేవని ఐశ్వర్య ఈ విషయాన్ని పోలీసులకు ఫిర్యాదు చేసింది.ఈ క్రమంలోనే కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టిన పోలీసులు విచారణలో భాగంగా షాకింగ్ విషయాలు బయటపడ్డాయి. ఈ క్రమంలోనే ఈ ట్రస్ట్ నుంచి పిల్లలను అమ్ముతూ వారు కరోనా కారణంగా చనిపోయారని రికార్డులు సృష్టిస్తూ దారుణానికి పాల్పడిన ట్రస్టు నిర్వాహకులపై మధురై కలెక్టర్ అనీష్ శేఖర్ సమగ్ర విచారణకు ఆదేశించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు కొనసాగిస్తున్నారు.