మీకు ఎస్‌బీఐ, యాక్సిస్, ఐడీబీఐ, సిండికేట్ బ్యాంకుల్లో ఖాతాలు ఉన్నాయా ? అయితే ఈ విషయాలను మీరు తప్పకుండా తెలుసుకోవాలి. జూలై 1 నుంచి ఆ బ్యాంకులకు చెందిన పలు రూల్స్ ను మార్చారు.
ఎస్‌బీఐ కస్టమర్లు తమ బ్రాంచ్ లేదా ఎస్‌బీఐ ఏటీఎంల నుంచి నెలకు కేవలం 4 సార్లు మాత్రమే ఉచితంగా నగదును తీసుకోవచ్చు. ఆ తరువాత నగదు తీస్తే ఒక్కో లావాదేవీకి రూ.15 + జీఎస్టీ కలిపి వసూలు చేస్తారు. అలాగే బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ ఖాతాదారులు ఏడాదిలో 10కి పైగా చెక్కులను ఉపయోగిస్తే ఆ తరువాత చార్జిలను వసూలు చేస్తారు. 10కి పైగా చెక్కులను వాడితన తరువాత మళ్లీ 10 చెక్కులు కావాలంటే రూ.40 + జీఎస్టీ వసూలు చేస్తారు. అదే 25 చెక్కులకు అయితే రూ.75 + జీఎస్టీ వసూలు చేస్తారు. సీనియర్ సిటిజెన్లకు ఈ చార్జిలు ఉండవు.
సిండికేట్ బ్యాంకును కెనరా బ్యాంకులో విలీనం చేశారు కనుక ఆ బ్యాంక్ ఐఎఫ్ఎస్‌సీ కోడ్‌లు జూలై 1 నుంచి మారాయి. కనుక ఆ వివరాలను తెలుసుకుని లావాదేవీలు చేస్తే మంచిది. ఇక ఆంధ్రా బ్యాంక్, కార్పొరేషన్ బ్యాంకులను యూనియన్ బ్యాంకులో విలీనం చేశారు కనుక ఖాతాదారులు జూలై 1 నుంచి కొత్త చెక్ బుక్‌లను తీసుకోవాలి.
యాక్సిస్ బ్యాంక్ ఖాతాదారులు ఏటీఎంల నుంచి తీసుకునే నగదు పరిమితిని పెంచారు. పలు రకాల సేవింగ్స్ ఖాతాలకు మినిమం బ్యాలెన్స్ రిక్వయిర్‌మెంట్‌లను పెంచారు. జూలై 1 నుంచి బ్యాంకు ఖాతా దారులు ప్రతి ఎస్ఎంఎస్ అలర్ట్‌కు 25 పైసలు నెలకు గరిష్టంగా రూ.25 చెల్లించాలి. ఓటీపీ మెసేజ్‌లకు చార్జిలు ఉండవు.
ఐడీబీఐ ఖాతాదారులు ఇకపై ఏడాదిలో 20కి పైగా చెక్కులను వాడితే ఆపై వాడే ప్రతి చెక్కుకు రూ.5 చెల్లించాలి. అయితే ఆ బ్యాంకులో సబ్‌కా సేవింగ్ ఖాతా ఉన్నవారికి ఈ రూల్ వర్తించదు. ఈ రూల్స్ అన్నీ జూలై 1 నుంచి అమలులోకి వచ్చాయి.