Papaya : మనకు అత్యంత చవకగా అందుబాటులో ఉండే అనేక రకాల పండ్లలో బొప్పాయి పండ్లు కూడా ఒకటి. ఇవి మనకు గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కడ పడితే అక్కడ దర్శనమిస్తాయి. చాలా మంది చెట్లను పెంచుతుంటారు. కనుక ఈ పండ్లకు కొదువ ఉండదు. ఇక ఈ పండ్లు మనకు ఏడాది పొడవునా అన్ని సీజన్లలోనూ లభిస్తాయి. అయితే బొప్పాయి పండ్లను తినేందుకు కొందరు ఇష్టపడరు. కానీ వీటిని రోజువారీ ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల ఎన్నో ప్రయోజనాలను పొందవచ్చు. ముఖ్యంగా ఈ పండ్లలో మన శరీరానికి అవసరం అయ్యే అనేక పోషకాలు ఉంటాయి. ఇవి మనల్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. కనుక బొప్పాయి పండ్లను తప్పక తినాలి.
బొప్పాయి పండ్లలో విటమిన్ సి అధికంగా ఉంటుంది. యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఎక్కువగానే ఉంటాయి. ఇవి చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. దీంతో మొటిమలు, మచ్చలు తగ్గుతాయి. వృద్ధాప్య ఛాయలు త్వరగా రావు. యవ్వనంగా కనిపిస్తారు. అలాగే ఈ పండ్లను తినడం వల్ల రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది. దీంతో సీజనల్ వ్యాధులకు అడ్డుకట్ట వేయవచ్చు. ఈ పండ్లను తినడం వల్ల జీర్ణ సమస్యలు ఉండవు. వీటిల్లో ఉండే ఫైబర్ మనకు ఎంతగానో మేలు చేస్తుంది. ఇది మలబద్దకాన్ని తగ్గిస్తుంది. గ్యాస్, అసిడిటీ నుంచి ఉపశమనాన్ని అందిస్తుంది. అలాగే ఈ ఫైబర్ బరువు తగ్గేందుకు కూడా సహాయ పడుతుంది.
ఇక బొప్పాయి పండ్లను కొందరు తినరాదు. ముఖ్యంగా పలు రకాల అనారోగ్య సమస్యలు ఉన్నవారు ఈ పండ్లను తినడం వల్ల సమస్యలు ఇంకా ఎక్కువయ్యేందుకు అవకాశాలు ఉంటాయి. తరచూ విరేచనాలు అవుతున్నవారు, పొట్టలో అసౌకర్యంగా ఉండేవారు బొప్పాయి పండ్లను తినరాదు. తింటే సమస్యలు మరింత ఎక్కువవుతాయి. అలాగే అలర్జీలు ఉన్నవారు వీటిని తినరాదు. గర్భిణీలు కూడా వీటిని తినరాదు.
ఆస్తమా, అధిక జ్వరం, శ్వాసకోశ సమస్యలు ఉన్నవారు ఈ పండ్లను తినరాదు. అలాగే తీవ్రమైన గ్యాస్ సమస్య ఉన్నవారు కూడా తినరాదు. తింటే సమస్యలు మరింత ఎక్కువయ్యేందుకు అవకాశాలు ఉంటాయి. కనుక బొప్పాయి పండ్లను తినే ముందు ఈ జాగ్రత్తలను తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుంది. లేదంటే ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడుతాయి.