కరోనా నేపథ్యంలో అనేక మంది ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. అయితే అలాంటి వారి కోసం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) కొత్తగా కవచ్ పర్సనల్ లోన్ కింద వ్యక్తిగత రుణాలను అందజేసే స్కీమ్‌ను ప్రారంభించింది. ఈ స్కీమ్ కింద రూ.25వేల నుంచి రూ.5 లక్షల వరకు రుణం పొందవచ్చు. దీనికి ఎలాంటి సెక్యూరిటీ అవసరం లేదు. వినియోగదారులు తమకు, తమ కుటుంబ సభ్యులకు కోవిడ్ చికిత్సకు అయ్యే ఖర్చును ఈ రుణంతో భర్తీ చేయవచ్చు.
ఈ స్కీమ్ కింద తీసుకునే రుణానికి 8.5 శాతం వడ్డీని చెల్లించాల్సి ఉంటుంది. ప్రాసెసింగ్ ఫీజు ఉండదు. ముందస్తుగా రుణాన్ని చెల్లిస్తే ఎలాంటి చార్జిలను వసూలు చేయరు. పెనాల్టీ కూడా ఉండదు. ఈ స్కీమ్ కింద తీసుకునే రుణాలను గరిష్టంగా 5 ఏళ్ల కాల పరిమితితో చెల్లించవచ్చు. అలాగే 3 నెలల మారటోరియం సదుపాయం లభిస్తుంది.
ఉద్యోగం చేసే వారు మాత్రమే కాకుండా స్వయం ఉపాధి పొందే వారు కూడా ఈ రుణానికి దరఖాస్తు చేయవచ్చు. ఏప్రిల్ 1, 2021 తరువాత కోవిడ్ పాజిటివ్ వచ్చిన వారు ఈ రుణం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ రుణం పొందేందుకు అవసరమైన పత్రాలను బ్యాంకుకు సమర్పించాల్సి ఉంటుంది. ఎస్‌బీఐ ఖాతాదారులు యోనో మొబైల్ బ్యాంకింగ్ యాప్ ద్వారా రుణం కోసం దరఖాస్తు చేయవచ్చు. ఇతర కస్టమర్లు తమకు సమీపంలోని ఎస్‌బీఐ బ్యాంక్ బ్రాంచిలో సంప్రదించాల్సి ఉంటుంది.