కన్న కూతురు ఓ యువకుడిని ప్రేమించిందని కోపంతో తల్లిదండ్రులే ఆమె పాలిట మృత్యువుగా మారారు. తల్లిదండ్రులు తెచ్చిన సంబంధాన్ని చేసుకోవడంలేదని ఆ యువతి పట్ల ఎంతో ఆగ్రహం వ్యక్తం చేస్తూ కన్న తల్లిదండ్రులే ఏమాత్రం కడుపుతీపి లేకుండా తనపై పెట్రోల్ పోసి నిప్పంటించిన ఘటన కడప జిల్లా రాయచోటిలో మంగళవారం రాత్రి చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే.
రాయచోటి సీఐ జి.రాజు కథనం మేరకు స్థానికంగా ఉన్న ఓ యువతి ఓ యువకుడితో ప్రేమలో పడింది. అయితే ఈ విషయం తెలిసిన తల్లిదండ్రులు తనకు వేరే పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. ఈ విధంగా వచ్చిన సంబంధాలు అన్నింటినీ యువతిచెడుకొట్టడంతో పాటు తనకు తాను ప్రేమించిన వ్యక్తితోనే పెళ్లి జరిపించాలని తమ తల్లిదండ్రులతో వాదనకు దిగింది.
ఈ విధంగా మంగళవారం రాత్రి మరోసారి తండ్రీ కూతుళ్ల మధ్య పెళ్లి ప్రస్తావన రావడంతో వీరిరువురి మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ క్రమంలోనే ఆ యువతి తల్లిదండ్రులు, సోదరుడు యువతిపై పెట్రోలు పోసి నిప్పంటించారు. ఆ సమయంలోనే యువతి కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు మంటలను అదుపు చేసి ఆమెను చికిత్స కోసం రిమ్స్ కి తరలించారు. ఈ క్రమంలోనే తల్లిదండ్రుల పై పోలీస్ కేసు ఫిర్యాదు చేసి విచారణ జరుపుతున్నట్లు సిఐ రాజు తెలియజేశారు.