కరోనా ప్రభావం మొదలైనప్పటి నుంచి ఎన్నో కంపెనీలు వినూత్న ఆవిష్కరణలు చేశాయి. ఈ క్రమంలోనే తాజాగా మరో వినూత్న ఆవిష్కరణ ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. అదే 3డి ప్రింటెడ్ మాస్క్. దీన్ని 3డి ప్రింటింగ్ మెషిన్‌తో రూపొందించారు. ఇది వైరస్ కణాలను అడ్డుకోవడమే కాదు, వైరస్‌ను నాశనం చేస్తుంది. పూణెకు చెందిన థింకర్ టెక్నాలజీస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఈ మాస్క్‌ను రూపొందించింది.
ఈ 3డి ప్రింటెడ్ మాస్క్ వైరస్‌ను అడ్డుకోవడమే కాక చంపుతుంది. ఈ మాస్క్ గుండా సూక్ష్మ క్రిములు ప్రవేశించలేవు. అందుకు గాను మాస్క్‌కు ప్రత్యేకమైన పదార్థంతో కోటింగ్ వేశారు. సోడియం ఓలిఫిన్ సల్ఫోనేట్ ఆధారిత మిశ్రమంతో ఈ మాస్క్‌కు కోటింగ్ వేశారు. దీని వల్ల ఈ మాస్క్ లోకి వైరస్‌లు ప్రవేశించలేవు. మాస్క్ మీదకు చేరగానే నశిస్తాయి. ఇక ఈ కోటింగ్‌ను ఇతర మాస్క్‌లకు కూడా వేయవచ్చు. ఎన్ 95, 2 ప్లై, క్లాత్ మాస్క్‌లకు ఈ కోటింగ్‌ను వేయవచ్చు.
కాగా ఈ 3డి ప్రింటెడ్ మాస్క్‌కు గాను ప్రస్తుతం ఆ కంపెనీ పేటెంట్ తీసుకునే ప్రయత్నంలో ఉంది. అయితే ఇప్పటికే ఈ మాస్కులను కొన్ని చోట్ల పంపిణీ చేశారు. నందుర్‌బర్, నాసిక్, బెంగళూరు తదితర ప్రాంతాల్లో సుమారుగా 6000 3డి ప్రింటెడ్ మాస్క్‌లను ఇప్పటికే వైద్య సిబ్బందికి అందజేశారు. ఈ క్రమంలోనే ప్రస్తుతం ఈ మాస్క్‌లను పరిశ్రమలో పెద్ద ఎత్తున ఉత్పత్తి చేస్తున్నారు. త్వరలోనే ఇవి ప్రజలకు అందుబాటులోకి రానున్నాయి.