సాధారణంగా మనం మినప్పప్పు లేదా అలసంద పప్పు తో వడలు తయారు చేసుకొని ఉంటాము. కానీ కొంచెం భిన్నంగా రుచికరంగా తినాలనిపించే వారు మొక్క జొన్న లతో వడలు తయారు చేసుకుని ఆ రుచిని ఆస్వాదించవచ్చు. మరి ఎంతో రుచికరమైన మొక్కజొన్న వడలు ఏ విధంగా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం.
కావలసిన పదార్థాలు
*లేత మొక్కజొన్న గింజలు రెండు కప్పులు
*శనగపిండి రెండు టేబుల్ స్పూన్లు
*బ్రెడ్ పౌడర్ రెండు టేబుల్ స్పూన్లు
*మొక్కజొన్న పిండి రెండు టేబుల్ స్పూన్లు
*అల్లం చిన్న ముక్కలు
*జీలకర్ర ఒక టీ స్పూన్
*ఉప్పు తగినంత
*కప్పు ఉల్లిపాయ ముక్కలు అర కప్పు
*అర కప్పు పచ్చిమిర్చి ముక్కలు
*అర కప్పు కొత్తిమీర తురుము
*కరివేపాకు కొద్దిగా
*నూనె డీప్ ఫ్రైకి సరిపడినంత
తయారీ విధానం
ముందుగా మొక్కజొన్న గింజలను మిక్సీలో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. తరువాత మిక్సీ గిన్నెలోకి తగినంత ఉప్పు జీలకర్ర అల్లం వేసి గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమంలోకి శెనగపిండి, బ్రెడ్ పౌడర్,మొక్కజొన్న పిండి వేసి బాగా కలుపుకోవాలి. ఇందులోకి ముందుగా తరిగిపెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కొత్తిమీర తురుము పచ్చిమిర్చి ముక్కలు కరివేపాకు వేసి ఈ మిశ్రమాన్ని తయారు చేసుకోవాలి. ఈ క్రమంలోనే స్టవ్ మీద కడాయి లో నూనె పెట్టి బాగా మరిగిన తర్వాత ఈ మొక్కజొన్న పిండి మిశ్రమంతో వడలు మాదిరిగా వేసి వేయించుకుని వడలు ఎరుపు రంగులోకి రాగానే తీసుకుంటే ఎంతో రుచికరమైన మొక్కజొన్న వడలు తయారైనట్లే.