సాధారణంగా మనం చపాతీ ఆలూ కర్రీ చేసుకుంటాము. కానీ రెండు కలిపి తీసుకుంటే అది ఆలు పరోటాగా మారుతుంది. మరి ఎంతో రుచికరమైన ఆలూ పరోటా ఏ విధంగా చేసుకోవాలో తెలుసుకుందాం.
కావలసిన పదార్ధాలు
*గోధుమపిండి ఒక కప్పు
*బంగాళాదుంపలు ఉడికించిన ఒక కప్పు
*ఉప్పు
*పచ్చిమిర్చి పేస్ట్ రెండు టేబుల్ స్పూన్లు
*కొత్తిమీర తురుము
*నూనె
*చిటికెడు పసుపు
* ఉల్లిపాయ ముక్కలు అర కప్పు
*కరివేపాకు రెమ్మ
తయారీ విధానం
ముందుగా గోధుమ పిండి చపాతీ పిండి మాదిరిగా కలిపి సిద్ధం చేసుకోవాలి. అదేవిధంగా బంగాళదుంప కూడా బాగా ఉడికించి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టి అందులో కొద్దిగా నూనె వేసి నూనె వేడయ్యాక ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు వేసి వేయించాలి. ఉల్లిపాయలు కొద్దిగా ఎరుపు రంగులోకి రాగానే పచ్చిమిర్చి పేస్ట్,ఉప్పు చిటికెడు పసుపు, వేసి బాగా మగ్గనివ్వాలి. ఐదు నిమిషాలు మరిగిన తరువాత ముందుగా ఉడికించి పెట్టుకొన్న బంగాళదుంపలను వేసి రెండు నిముషాలు కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ మిశ్రమం కాస్త చల్లబడిన తర్వాత ఇప్పుడు చపాతి పిండి తీసుకొని దానిని పూరీ సైజులో పెద్దగా కొంచెం మందంగా చేసుకోవాలి. ఇప్పుడు ఈ పూరి లోకి ముందుగా తయారు చేసుకున్న బంగాళదుంప మిశ్రమాన్ని పెట్టి పూరి మొత్తం ఆ మిశ్రమం కనపడకుండా కప్పివేయాలి. మరి ఈ పిండిని పూరి సైజులో పెద్దగా చేసుకుని పాన్ పై కొద్దిగా నూనె వేసి అటూ ఇటూ తిప్పుతూ కాల్చుకుంటే ఎంతో రుచికరమైన ఆలు పరాట తయారైనట్లే.