Koratala Siva : మెగాస్టార్ చిరంజీవి కెరీర్‌లోనే అత్యంత భారీ డిజాస్టర్‌గా నిలిచిన చిత్రం.. ఆచార్య. ఇందులో ఆయనతోపాటు ఆయన తనయుడు రామ్ చరణ్ కూడా ఇంకో కీలకపాత్రలో నటించారు. అయితే ఈ మూవీకి రూ.84 కోట్ల మేర నష్టాలు వచ్చాయని ట్రేడ్ వర్గాలు తెలిపాయి. ఈ క్రమంలోనే ప్రస్తుతం ఆ నష్టాలను డిస్ట్రిబ్యూటర్లకు ఇంకా ఇవ్వలేదని సమాచారం. చిరంజీవి ఇటీవలే అమెరికా టూర్‌ను ముగించుకుని వచ్చారు. దీంతో ఆయన షూటింగ్‌లలో మళ్లీ బిజీ అయ్యారు. అయితే ఆచార్య నష్టాలను మాత్రం ఇంకా భర్తీ చేయనట్లు తెలుస్తోంది. మరోవైపు ఆచార్య ఎఫెక్ట్ వల్ల చిరంజీవి తాను ప్రస్తుతం నటిస్తున్న సినిమాల విషయంలోనూ ఇంకా జాగ్రత్తలు వహిస్తున్నారని సమాచారం.
చిరంజీవి ప్రస్తుతం గాడ్ ఫాదర్ సినిమా చేస్తున్నారు. ఈ సినిమా దసరా వరకు రిలీజ్ అవుతుందని సమాచారం. తరువాత భోళా శంకర్, వాల్తేరు వీరయ్య చిత్రాలు లైన్‌లో ఉన్నాయి. ఇక తాజాగా పక్కా కమర్షియల్ చిత్ర ప్రీ రిలీజ్ వేడుక సందర్బంగా చిరంజీవి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. మారుతితో కలసి సినిమా చేస్తానని హామీ ఇచ్చారు. దీంతో ఆ మూవీ అప్ డేట్ కోసం ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. అయితే ఆచార్య విషయంలో తప్పు ఎక్కడ జరిగిందో తెలియదు కానీ.. దర్శకుడు కొరటాల మాత్రం తాజాగా చేసిన ఇన్‌డైరెక్ట్ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
దర్శకుడు సినిమాకు ముఖ్యమని.. దర్శకుడి దృష్టికోణంలో సినిమా ఉండాలని అన్నారు. తాను కెమెరా ముందు అలాగే చూస్తూ నిలుచున్నానని.. చిరు, చరణ్ ఇద్దరూ యాక్ట్ చేస్తుంటే చూస్తూ ఉండిపోయానని అన్నారు. అంటే ఈ మూవీకి కొరటాల డైరెక్షన్ చేయలేదనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. అసలు ఆయన చిరంజీవి కోసం రాసుకున్న కథ వేరేనట. ఇందులో చరణ్ పాత్ర అసలు లేదట. కానీ సురేఖ కోరిక మేరకు ఈ మూవీలో చరణ్ కూడా ఉంటే బాగుంటుందని చిరంజీవి అనడంతో చరణ్ కోసం కథను మార్చారట.
ఇక తరువాత సినిమాలోంచి ఆచార్యకు హీరోయిన్‌గా ఉన్న కాజల్ అగర్వాల్‌ను లేపేశారు. చివరకు కథలో కొన్ని మార్పులు చేశారు. అలాగే రిలీజ్ చివరి నిమిషంలోనూ చాలా మార్పులు చేశారు. దీంతో సినిమా బెడిసికొట్టింది. అయితే కొరటాల ఇలా ఇన్‌డైరెక్ట్‌గా కామెంట్స్ చేయడంతో అసలు ఆచార్యకు ఆయన దర్శకత్వం వహించలేదని తెలుస్తోంది. కనుకనే ఆయన అసంతృప్తితో ఉన్నారట. పూర్తి స్థాయిలో కొరటాలకే అన్ని బాధ్యతలు అప్పగించి ఉంటే ఫలితం మరోలా ఉండేదని అంటున్నారు. ఏది ఏమైనా ఈ మూవీ అటు చిరంజీవికి, ఇటు కొరటాలకు భారీ డిజాస్టర్‌లా మిగిలిపోయింది. మరి ఈ ఇద్దరూ చేస్తున్న తదుపరి సినిమాలతో అయినా హిట్ కొడతారా.. లేదా.. అన్నది వేచి చూస్తే తెలుస్తుంది.