Virata Parvam Movie Review : గతంలో నక్సల్స్ బ్యాక్‌డ్రాప్‌తో అనేక సినిమాలు వచ్చాయి. కానీ ఈ మధ్య కాలంలో అలాంటి సినిమాలు రావడం లేదు. ఎప్పుడో ఒకసారి ఆర్.నారాయణ మూర్తి లాంటి నటులు మాత్రమే ఈ తరహా సినిమాలను తీస్తున్నారు. మొన్నా మధ్యే చిరంజీవి ఆచార్య సినిమాతో నక్సల్‌గా కనిపించారు. అయితే ఆ కథ వేరే. ఒక ఊరి కోసం చేసే పోరాటం అది. ఇక విరాట పర్వం మూవీ కూడా నక్సల్ బ్యాక్‌డ్రాప్‌తోనే వచ్చింది. ఇందులో రానా, సాయిపల్లవి ఇద్దరూ నక్సలైట్లుగా నటించారు. ఈ మూవీ శుక్రవారం (జూన్ 17) థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి రానా ఈ మూవీతో హిట్ కొడతాడా.. అసలు సినిమా ఎలా ఉంది.. కథ ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
విరాటపర్వం సినిమాను యదార్థ సంఘటనలు, పాత్రల ఆధారంగా తెరకెక్కించారు. 1990లలో తెలంగాణలో నక్సలైట్ల ప్రభావం ఉధృతంగా ఉన్న సమయంలో జరిగిన కొన్ని నిజమైన సంఘటనల ఆధారంగా దర్శకుడు వేణు ఊడుగుల ఈ సినిమాను తెరకెక్కించినట్లు చెప్పారు. అప్పట్లో నక్సలైట్లు రవన్న, సరళ జీవితాల ఆధారంగా ఈ మూవీని తెరకెక్కించారు. ఇక కథ విషయానికి వస్తే..

కథ..
అది 1973వ సంవత్సరం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. తెలంగాణ ప్రాంతం. దట్టమైన అడవి. అర్థరాత్రి పూట ఓ రోజు పోలీసులు, నక్సలైట్లకు మధ్య భీకరమైన కాల్పులు జరుగుతాయి. అదే సమయంలో వెన్నెల (సాయి పల్లవి) జన్మిస్తుంది. చిన్నప్పటి నుంచే ఆమెకు పట్టుదల బాగా ఎక్కువ. మొండిరకం. అనుకున్నది సాధించడం కోసం ఏమైనా చేస్తుంది. జమ్మికుంటలోని మారుమూల గ్రామానికి చెందిన వెన్నెల.. రవన్న (రానా) రాసే పుస్తకాలకు ఆకర్షితురాలవుతుంది. ఆయనను గాఢంగా ప్రేమిస్తుంది. ఎలాగైనా ఆయనను కలవాలని అనుకుంటుంది. ఈ క్రమంలోనే ఒకానొక సమయంలో రవన్నను ఎలాగైనా కలవాలని చెప్పి వెన్నెల ఇంట్లో ఉత్తరం రాసి పెట్టి బయటకు వెళ్లిపోతుంది. మరి ఆమె రవన్నను కలిసిందా ? తన ప్రేమను వ్యక్తపరిచిందా ? అందుకు రవన్న అంగీకరిస్తాడా ? అసలు చివరకు ఏమవుతుంది ? అన్న వివరాలను తెలుసుకోవాలంటే.. సినిమాను వెండితెరపై చూడాల్సిందే.
ఈ సినిమాను పక్కా నక్సలైట్ బ్యాక్ డ్రాప్ తో రూపొందించారు. కానీ ఇందులో లవ్ ట్రాక్‌ను జోడించారు. కనుక ప్రేక్షకులకు బోర్ కొట్టదు. రవన్న కోసం పరితపించే.. ఆయనను ఆరాధించే యువతిగా వెన్నెల పాత్రలో సాయిపల్లవి ఒదిగిపోయింది. ఆమెకు ఇలాంటి క్యారెక్టర్ లభించడం తొలిసారే. అయినప్పటికీ అద్భుతంగా నటించిందని చెప్పవచ్చు. సినిమాలో రానా కన్నా ఆమె పాత్ర నిడివే ఎక్కువ. మనకు ఆమే సినిమా మొత్తం కనిపిస్తుంది. సాయిపల్లవి యాక్టింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ మూవీలోనూ అలాగే జీవించింది. ఇక రానా గురించి ఎంత చెప్పినా తక్కువే. రవన్న పాత్రలో రానా అద్భుతంగా నటించాడు. ఇక మిగిలిన పాత్రల్లోనూ ఆయా నటులు తమ పరిధుల మేర బాగానే నటించారని చెప్పవచ్చు.
1990లలో నక్సల్స్ కథాంశంతో సినిమాలు బాగానే వచ్చాయి. కనుక వెనుకటి తరం వారికి ఈ సినిమాలు ఎలా ఉంటాయో బాగా తెలుసు. కానీ ఈ తరం వారికి నక్సల్ ఉద్యమాలు, వారు ఎందుకు పోరాటాలు చేస్తుంటారు.. అన్న విషయాలు తెలియవు. కనుక వాటి గురించి తెలుసుకోవాలనుకునే వారు ఈ మూవీని చూడవచ్చు. అలాగే సాయిపల్లవి ఫ్యాన్స్ అయితే కచ్చితంగా ఒకసారి చూడవచ్చు. ఎంతో ఆశించి, అంచనాలు పెట్టుకుని అయితే వెళ్లకూడదు. ఒకసారి మూవీని చూద్దామని అనుకుంటే వెళ్లి రావచ్చు. ఒక భిన్నమైన ఫీలింగ్‌ను కలిగిస్తుంది. ఇక ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఏ స్థాయిలో వసూళ్లను రాబడుతుందో చూడాలి.