Srikanth : తెలుగు సినీ ప్రేక్షకులకు నటుడు శ్రీకాంత్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈయన ఎన్నో కుటుంబ, ప్రేమ కథా చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు పొందారు. కెరీర్ మొదట్లో శ్రీకాంత్ విలన్ పాత్రలలో నటించారు. తరువాత హీరోగా రాణించారు. అయితే ఇప్పుడు మళ్లీ విలన్ పాత్రలు చేసి మెప్పిస్తున్నారు. అయితే తన కెరీర్లో ఎన్నో సినిమాలలో నటించిన శ్రీకాంత్ పలు ఫ్లాప్‌లను కూడా ఎదుర్కొన్నారు. అలాగే కొన్ని సినిమాలకు గాను ఆయన ఇబ్బందులు కూడా పడ్డారు. ఈ క్రమంలోనే ఆయన తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన సినిమా కెరీర్‌కు సంబంధించి పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.
అప్పటి హీరోయిన్ సౌందర్యతో శ్రీకాంత్ పలు సినిమాలలో నటించారు. అయితే తారక రాముడు, అనగనగా ఒక అమ్మాయి వంటి సినిమాలపై ఎన్నో ఆశలు పెట్టుకున్నానని.. కానీ అవి ఫ్లాప్ అయ్యాయని శ్రీకాంత్ వివరించారు. ఇక సౌందర్యతో కలిసి ఆరు సినిమాల్లో నటించానన్న శ్రీకాంత్ ఆమె చనిపోవడం దురృష్టకరమన్నారు. అయితే అప్పట్లో తాను ఖడ్గం అనే మూవీలో నటించినందుకు గాను తనకు బెదిరింపు కాల్స్ వచ్చాయన్నారు. తనను చంపేస్తామని బెదిరించారని తెలిపారు.

ఖడ్గం సినిమాలో ఓ వర్గానికి వ్యతిరేకంగా డైలాగ్స్ చెప్పానని.. అందుకు గాను తనను చంపేస్తానని బెదిరించారని.. శ్రీకాంత్ గుర్తు చేశారు. అయితే ఆ దెబ్బతో తాను జేబులో గన్ పెట్టుకుని తిరిగానన్నారు. క్రికెట్ ఆడేందుకు వెళ్లినా జేబులో గన్ ఉండేదన్నారు. ఇలా తన సినిమా కెరీర్లో ఎన్నో ఎత్తు పల్లాలను చూశానని శ్రీకాంత్ చెప్పుకొచ్చారు. అయితే శ్రీకాంత్ ఈ మధ్య తన కెరీర్ మొదట్లో నటించినట్లుగా మళ్లీ విలన్ పాత్రల్లోనే కనిపిస్తున్నారు. అయితే ఆయన విలన్‌గానే సెటిల్ అవుతారా.. మళ్లీ హీరోలా పాత్రలు చేస్తారా.. అన్న విషయం వేచి చూస్తే తెలుస్తుంది.