దేశంలోని అసంఘటిత రంగానికి చెందిన కార్మికులకు కేంద్ర ప్రభుత్వం ఎన్నో డబ్బు పొదుపు చేసుకునే పథకాలను అందిస్తోంది. వాటిల్లో అటల్ పెన్షన్ యోజన (ఏపీవై) ఒకటి. ఈ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం 2015లో ప్రారంభించింది. ఇందులో నెల నెలా నిర్దిష్ట మొత్తంలో డబ్బును పొదుపు చేసుకోవడం వల్ల రిటైర్మెంట్ వయస్సులో నెల నెలా రూ.1000 నుంచి రూ.5000 వరకు పెన్షన్ పొందవచ్చు.
18 ఏళ్లు ఉన్న ఓ వ్యక్తి అటల్ పెన్షన్ యోజన కింద నెలకు రూ.42 కనీసం పొదుపు చేస్తే రిటైర్మెంట్ వయస్సులో నెలకు రూ.1000 పెన్షన్ పొందవచ్చు. అదే నెలకు రూ.84 పొదుపు చేస్తే రూ.2000, నెలకు రూ.126 పొదుపు చేస్తే రూ.3000, నెలకు రూ.168 పొదుపు చేస్తే రూ.4000, నెలకు రూ.210 పొదుపు చేస్తే రూ.5000 వరకు పెన్షన్ పొందవచ్చు. అంటే రోజుకు రూ.7 చొప్పున 30 రోజులకు అంటే నెలకు రూ.210 పొదుపు చేస్తే రిటైర్మెంట్ వయస్సులో నెలకు రూ.5000 పెన్షన్ పొందవచ్చన్నమాట.
ఇక ఈ పథకం కింద పొదుపు చేసుకునే డబ్బుకు ఆదాయపు పన్ను చట్టం సెక్షన్ 80సి కింద పన్ను మినహాయింపు పొందవచ్చు. ఈ పథకంలో డబ్బు పొదుపు చేసుకునే లబ్ధిదారుడు చనిపోతే అతని కుటుంబానికి రూ.1.70 లక్షల నుంచి రూ.8.50 లక్షల వరకు పెన్షన్ వెల్త్ లభిస్తుంది. వారికి నెల నెలా పెన్షన్ లభిస్తుంది.