కరోనా నేపథ్యంలో రోగ నిరోధక శక్తిని పెంచుకునేందుకు ప్రతి ఒక్కరూ యత్నిస్తున్నారు. అందులో భాగంగానే రోగ నిరోధక శక్తిని పెంచే ఆహారాలను తీసుకుంటున్నారు. అయితే రోగ నిరోధక శక్తిని పెంచే రసం ను ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
కావల్సిన పదార్థాలు
- చింతపండు గుజ్జు – 1 టేబుల్ స్పూన్
- టమాటా – 1 (సన్నగా తరగాలి)
- కరివేపాకులు – 10 – 12
- మిరియాలు – 1 – 2 టేబుల్ స్పూన్లు
- వెల్లుల్లి – 4 – 5 రెబ్బలు
- పసుపు – అర టీస్పూన్
- ఎండు మిరపకాయలు – 3
- ఉప్పు – రుచికి సరిపడా
- జీలకర్ర – 1 టీస్పూన్
- ఇంగువ – అర టీస్పూన్
- కొత్తిమీర – 1 టేబుల్ స్పూన్ (సన్నగా తరగాలి)
- నూనె – 1 టేబుల్ స్పూన్
- ఆవాలు – 1 టీస్పూన్
రసం తయారీ విధానం
ఎండు మిరపకాయలు 2, మిరియాలు, జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకులు 4-5 తీసుకుని మిక్సీలో వేసి పొడి చేయాలి. ఆ మిశ్రమాన్ని పక్కన పెట్టుకోవాలి. కడాయి తీసుకుని అందులో నూనె వేసి వేడి చేయాలి. తరువాత అందులో తరిగిన టమాటాలు, మిగిలిన కరివేపాకులు, పసుపు, కొద్దిగా ఉప్పు వేసి 3-4 నిమిషాల పాటు ఉడికించాలి. అంతకు ముందు సిద్ధం చేసిన మిశ్రమాన్ని వేసి బాగా కలపాలి. తరువాత అందులో చింత పండు గుజ్జు, 2 కప్పుల నీటిని పోయాలి. మూత పెట్టి సిమ్‌లో ఉంచి 10 నిమిషాల పాటు ఉడికించాలి. తరువాత ఇంకో పాత్ర తీసుకుని అందులో కొద్దిగా నూనె లేదా నెయ్యి వేసి వేడిచేయాలి. వేడి అవగానే ఆవాలు, 1 ఎండు మిరపకాయ, ఇంగువ వేసి వేయించుకోవాలి. ఇంకో పాత్రలో ఉండే మిశ్రమాన్ని ఇందులో వేయాలి. స్టవ్ ఆర్పి కొత్తిమీర ఆకులతో గార్నిష్ చేసుకోవాలి. రసం తయారవుతుంది. అందులో మిరియాల పొడిని చల్లుకోవాలి. దీన్ని అన్నంతో రోజూ మధ్యాహ్నం భోజనంలో తీసుకోవచ్చు. ఈ రసం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. సాధారణ జలుబు, దగ్గు తగ్గుతాయి.