కరోనా రెండవ దశ ఎన్నో కుటుంబాలను అతలాకుతలం చేసింది. ఇంటి పెద్దను కోల్పోవటం వల్ల ఎన్నో కుటుంబాలు రోడ్డున పడ్డాయి. ఎంతో మంది చిన్నారులు అనాధలుగా మిగిలిపోయారు. ఈ విధంగా ఎంతో సంతోషంగా గడుపుతున్న కుటుంబాలలో కరోనా పంజా విసురుతూ ఏకంగా కుటుంబాలనే బలి తీసుకుంటుంది. తాజాగా నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గ పరిధిలోని పెంట్లవెల్లి మండల కేంద్రంలోని ఓ కుటుంబాన్ని కరోనా మహమ్మారి కాటు వేసింది.
నాలుగు రోజుల క్రితం తల్లి కరోనా బారిన పడి మృతి చెందగా అన్న వదినలు కరోనాతో ఆసుపత్రి పాలయ్యారు. దీంతో దివ్యాంగుడుగా ఉన్న రాజేష్ అనే వ్యక్తి ఆలనా పాలన తన తల్లి అన్న వదిన చూసుకునేవారు. ఈ కరోనా మహమ్మారి వల్ల తల్లి కానరాని లోకాలకు వెళ్లగా, అన్నా వదినలకు ఆస్పత్రి పాలయ్యారు. ఈ క్రమంలోని దిక్కుతోచని స్థితిలో ఉన్న దివ్యాంగుడు రాజేష్ ఎంతో మనస్థాపం చెంది కత్తితో గొంతు కోసుకున్నాడు.
కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న అతనిని ఆసుపత్రికి తరలించడం కోసం గ్రామస్తులు ఎవరూ ముందుకు రాలేదు. తమ కుటుంబంలో ప్రతి ఒక్కరికి కరోనా ఉండడంచేత ఎవరు ముందుకు రాకపోవడంతో సమాచారం అందుకున్న పోలీసులు 108 సిబ్బందిని పంపించి కొల్లాపూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే రాజేష్ గొంతు నరం కట్ కావడంతో అతని పరిస్థితి విషమంగా ఉండటంవల్ల అతనిని మహబూబ్ నగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.అయితే అతని పరిస్థితి విషమంగానే ఉందని రక్తస్రావం ఏమాత్రం ఆగడంలేదని వైద్యులు తెలిపారు. ఈ విధంగా ఎంతో సంతోషంగా ఉన్న వారి కుటుంబంలో కరోనా కాటువేసి కుటుంబాన్ని అతలాకుతలం చేసింది. కేవలం రాజేష్ కుటుంబం మాత్రమే కాకుండా మన దేశంలో ఇలాంటి కుటుంబాలు ఎన్నో కరోనా బారిన పడ్డాయి.