ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఏ విధమైనటువంటి పరిస్థితులు నెలకొన్నాయో అందరికీ తెలిసిందే. రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఆసుపత్రిలో ఆక్సిజన్, పడకల సౌకర్యం లేక ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారు.తాజాగా కర్నాటకలో జరిగిన ఓ సంఘటన మన దేశంలోని పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో,కరోనా కారణంగా ఏర్పడిన ఈ పరిస్థితికి అద్దం పడుతుంది.
బెంగళూరు నగరంలోని కరోనాతో బాధపడుతున్న ఓ మహిళను ఆసుపత్రిలో చేర్చడం కోసం తీసుకెళ్లారు. అయితే ఆ నగరం మొత్తం తిరిగిన ఆమెకు ఒక ఆస్పత్రిలో కూడా బెడ్ దొరకకపోవడంతో ఎంతో నిస్సహాయ స్థితిలో ఉన్న ఆ కుటుంబం కరోనా రోగిని తీసుకొని ఏకంగా కర్ణాటక అసెంబ్లీ ఎదుట బైఠాయించారు. వీరికి మద్దతుగా బంధువులు,యువజన కాంగ్రెస్ నేత నాల్పాద్ అక్కడికి చేరుకొని నిరసనలో పాల్గొన్నారు.
దాదాపు అరగంట పాటు అసెంబ్లీ ఎదుట నిరసన వ్యక్తం చేయడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. విషయం తెలుసుకున్న వెంటనే సి ఎస్ రవికుమార్ వెంటనే బాధితుడికి బెంగళూరులోని విక్టోరియా ఆసుపత్రిలో బెడ్ ఏర్పాటు చేశారు. ఈ క్రమంలోనే బాధితులతో కలిసి విధానసౌధ ఎదుట ఆందోళనకు దిగిన యువజన కాంగ్రెస్ నేతను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సంఘటన ఒకటి చాలు మన దేశంలో ఏ విధమైనటువంటి పరిస్థితులు నెలకొన్నాయో అర్థమవుతుంది.