Allu Arjun : టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప మూవీ పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నారు. డిసెంబర్ 17వ తేదీన ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో చిత్ర యూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలను వేగవంతం చేసింది. అయితే తాజాగా బన్నీ ఓ కంపెనీకి చెందిన యాడ్‌లో నటించి విమర్శల పాలైన సంగతి తెలిసిందే. దీంతో అందులో ఆయన చిక్కుల్లో పడ్డారు.
ర్యాపిడో సంస్థకు చెందిన యాడ్‌లో అల్లు అర్జున్ నటించి అడ్డంగా బుక్కయ్యారు. ఆర్‌టీసీ బస్సులు వేస్టు.. ర్యాపిడో బైక్ అయితే సాఫీగా ప్రయాణం చేయవచ్చు.. అని చెబుతూ ఆ కంపెనీకి చెందిన యాడ్‌లో అల్లు అర్జున్ తాజాగా నటించారు. అయితే ఆ యాడ్‌పై తెలంగాణ ఆర్‌టీసీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. అందులో భాగంగానే టీఎస్ఆర్‌టీసీ ఎండీ వీసీ సజ్జనార్ సదరు సంస్థతోపాటు, అల్లు అర్జున్‌కు నోటీసులు పంపించారు.
తెలంగాణ ఆర్‌టీసీని కించపరిచేలా ఉన్న అల్లు అర్జున్ యాడ్‌ను వెంటనే తొలగించాలని ర్యాపిడో సంస్థకు, అల్లు అర్జున్‌కు సజ్జనార్ నోటీసులను జారీ చేశారు. వెంటనే క్షమాపణలు చెప్పాలని అన్నారు. లేదంటే చట్ట ప్రకారం ముందుకు వెళ్తామని హెచ్చరించారు. అయితే దీనిపై ఎలాంటి స్పందన లేకపోవడంతో కోర్టులో కేసు విచారణ జరిగింది.
ఈ క్రమంలోనే తెలంగాణ హైకోర్టు ర్యాపిడో సంస్థతోపాటు, అల్లు అర్జున్‌కు షాకిచ్చింది. ఆర్టీసీ పరువుకు నష్టం కలిగించేలా రాపిడో సంస్థ యాడ్ ప్రసారం చేసిందని.. అందువల్ల ఆ సంస్థకు చెందిన బైక్ రైడ్ ప్రకటన చిత్రాలను ప్రసారం చేయకుండా వెంటనే నిలిపివేయాలని హైకోర్టు రాపిడోను ఆదేశించింది.
అలాగే యూ ట్యూబ్ లో కూడా ఉన్న వీడియోలను, పరువు నష్టం కలిగించే ప్రకటన చిత్రాలను తొలగించాలని కోర్టు ఆదేశించింది. కోర్టు ఆదేశాలను ఎవరైనా ఉల్లంఘించినట్లు తేలితే వారు విచారించబడతారని హెచ్చరించింది. ఇక కోర్టు ఆదేశాలపై ర్యాపిడో సంస్థ ఎలా స్పందిస్తున్నది తెలియాల్సి ఉంది.