Shilpa Chowdary : కిట్టీ పార్టీల పేరుతో ఎంతోమంది ప్రముఖులని మోసం చేసిన శిల్పా చౌదరి బాగోతాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. చాలామంది ప్రముఖుల్ని మోసం చేసిన శిల్ప.. దాదాపుగా రూ.200 కోట్ల దాకా కుచ్చు టోపీ పెట్టినట్లు చెబుతున్నారు. వసూలు చేసిన సగం డబ్బుల్ని ఇంటి కోసమే ఖర్చు చేసినట్లు పోలీసుల విచారణలో తెరపైకి వచ్చింది. అధికవడ్డీ ఇస్తానని చెప్పి.. ప్రముఖుల నుంచి కోట్ల రూపాయలు వసూలు చేసినట్లు చెబుతున్నారు.
రియల్ ఎస్టెట్ వ్యాపారం పేరుతో శిల్ప మోసాలకు పాల్పడినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ కేసు వెలుగులోకి వచ్చిన 5 రోజుల తర్వాత ఓ అగ్ర హీరో సోదరి, యంగ్ హీరో భార్య మాదాపూర్ పోలీసులను ఆశ్రయించారు. ఆమె మరెవరో కాదు మహేష్ బాబు సోదరి, సుధీర్ బాబు భార్య ప్రియదర్శిని. శిల్ప తన దగ్గర డబ్బు తీసుకుని మోసం చేసిందంటూ ప్రియదర్శని పోలీసులను ఆశ్రయించారు. తన వద్ద రూ. 2.90 కోట్లు తీసుకుని శిల్ప మోసం చేసినట్లు ఆమె మాదాపూర్ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
ఒక్క నార్సింగి పరిధిలోనే సుమారుగా రూ.10 కోట్ల మోసానికి పాల్పడిందని పోలీసులు భావిస్తున్నారు. సినీ ప్రముఖుల నుంచి పారిశ్రామిక వేత్తల వరకు ఎవరినీ వదిలి పెట్టలేదు శిల్పా చౌదరి. హంగూ.. ఆర్భాటం ప్రదర్శిస్తూ పలువురు సెలబ్రెటీలను బుట్టలో వేసుకొని కోట్లలో బురిడీ కొట్టించింది.