టాలీవుడ్ ఇండస్ట్రీలో రాజమౌళి దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం “ఆర్ఆర్ఆర్”. పాన్ ఇండియా తరహాలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై దేశవ్యాప్తంగా ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నటిస్తున్న ఈ సినిమా ఇప్పటికే విడుదల కావాల్సి ఉండగా పలు కారణాల వల్ల వాయిదా పడుతూ వస్తోంది.
కరోనా విపత్తు తర్వాత శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని అక్టోబర్ 13 తప్పకుండా విడుదల చేస్తామని చిత్ర బృందం ప్రకటించినప్పటికీ మరోసారి కరోనా సినిమా రంగంపై పంజా విసిరింది. దీంతో సినిమాలన్నీ వాయిదా పడ్డాయి. అయినప్పటికీ ఈ సినిమాని మాత్రం అనుకున్న సమయానికి విడుదల చేయాలని చిత్ర బృందం ప్రయత్నిస్తోంది.
పాన్ ఇండియా తరహాలో విడుదల అవుతున్న ఈ చిత్రానికి బాలీవుడ్‌తో పాటు.. ఓవర్‌సీస్ కూడా కీలకమే. ఈ రెండు చోట్ల పరిస్థితులు అనుకూలంగా ఉంటేనే ఈ చిత్రాన్ని అనుకున్న సమయానికి విడుదల చేసే అవకాశాలు ఉంటాయి. లేనిపక్షంలో ఈ సినిమాను వచ్చే ఏడాదికి వాయిదా వేయాల్సిందేనని తెలుస్తోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్లు, టీజర్లు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకోవడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.మరి అనుకున్న సమయానికే ఈ చిత్రం విడుదల అవుతుందో.. వాయిదా పడుతుందో వేచిచూడాల్సిందే.