కరోనా వల్ల ఓ వైపు ప్రజలు భయాందోళనలకు గురవుతుంటే కోవిడ్ బాధితులకు చికిత్స అందిస్తున్న వైద్యులు, వైద్య సిబ్బంది నరక యాతన అనుభవిస్తున్నారు. రోజూ కొన్ని గంటల పాటు పీపీఈ కిట్‌లను ధరించి బాధను దిగమింగుతూ చికిత్స చేస్తున్నారు. మరోవైపు ఒత్తిడి పెరుగుతోంది. దీంతో అర్ధాంతరంగా తనువు చాలిస్తున్నారు. తాజాగా మరో డాక్టర్ ఒత్తిడి భరించలేక ఆత్మహత్య చేసుకున్నాడు.
ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌కు చెందిన డాక్టర్ వివేక్ రాజ్ (36) ఢిల్లీలోని ఓ ప్రైవేటు హాస్పిటల్‌లో రెసిడెంట్ డాక్టర్‌గా పనిచేస్తున్నాడు. కోవిడ్ నేపథ్యంలో గత నెల రోజుల నుంచి ఐసీయూలో ఉంటూ రోగులకు చికిత్స అందిస్తున్నాడు. రోజూ ఎంతో మంది కోవిడ్ రోగులకు చికిత్స అందించడమే అతని పని. అతని వల్ల ఎంతో మంది కోవిడ్ నుంచి బయట పడ్డారు. ఇక రోజూ అతను ప్రాణాపాయ స్థితిలో ఉండే కోవిడ్ రోగులకు కూడా చికిత్సను అందిస్తున్నాడు.
అయితే తాజాగా అతను ఒత్తిడిని భరించలేక ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నెల రోజులుగా ఐసీయూలో ఉంటూ చికిత్సను అందిస్తున్నానని, ఒత్తిడిని భరించలేకపోతున్నానని అతను తన సూసైడ్ నోట్‌లో తెలిపాడు. దీంతో అతని మృతి పట్ల తోటి డాక్టర్లు, వైద్య సిబ్బంది సంతాపం వ్యక్తం చేశారు. అతనికి గత నవంబర్ నెలలో వివాహం జరగ్గా అతని భార్య గర్భవతి. దీంతో అతని ఆత్మహత్య అతని కుటుంబంలో విషాదాన్ని నింపింది.